పల్నాటి యుద్ధం: లావు వర్సెస్ విడదల.. !
ప్రస్తుత నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ వ్యవహారం కూడా రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది.
By: Tupaki Desk | 25 March 2025 11:33 AM ISTపల్నాటి పౌరుషం.. గురించి అందరికీ తెలిసిందే. ఆ గడ్డ నీరే అలాంటిదని అంటారు. గతంలో బ్రహ్మనాయుడు, నాగమ్మల మధ్య ఈ పౌరుషమే రాజకీయంగా మారి.. పల్నాటి యుద్ధానికి దారి తీసింది. ఇప్పుడు కూడా అదే తరహా యుద్ధానికి తెరదీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ వ్యవహారం కూడా రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి.
అసలేంటి వివాదం?
పల్నాడులో స్టోన్ క్రషర్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. వైసీపీ హయాంలో బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ యజమానిని బెదిరించి అతని నుంచి రూ.2 కోట్లనుఅప్పటి మంత్రిగా ఉన్న విడుదల రజనీ తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. దీనికి అప్పటి పోలీసు ఉన్నతాధికారిగా వ్యవహరించిన ఐపీఎస్ జాషువా సహకరించారని.. బెదిరించి సొమ్ములు వసూలు చేశారన్న వాదన కూడా ఉంది. ఇక, రజనీ మరుదులు ఈ వ్యవహారంలో కీలక రోల్ పోషించారన్నది పోలీసుల వాదన. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్కడ నుంచి ఎక్కడి దాకా..?
అయితే.. ఇదంతా ఎంపీ లావు చేయిస్తున్న దాడేనని.. తానేమీ ఎరుగనని మాజీమంత్రి విడదల అంటున్నారు. తనపై ఉన్న రాజకీయ కక్షల కారణంగానే ఇప్పుడు వేధింపులకు గురి చేస్తున్నట్టు చెబుతున్నారు. తాను ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తనను రాజకీయంగా తొక్కేసేందుకు ఎంపీ ఆడుతున్న నాటకమని ఆమె చెబుతున్నారు. అయితే.. దీనికి ప్రతిగా ఎంపీ లావు కూడా స్పందిస్తూ.. తనకు ఈ కేసుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బాలాజీ క్రషర్స్ యజమానితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంతేకాదు.. విడదల రజనీనే తన వద్దకు రాయబారం పంపించారని చెప్పారు. ఈ కేసులో విడదల రజనీ ముద్దాయేనని వ్యాఖ్యానించారు.
ఎప్పటి పగ..!
ఇక, ఈ కేసు విషయాన్ని పక్కన పెడితే.. అటు లావు-ఇటు విడదలమధ్య గత ఐదేళ్ల శత్రుత్వం ఉందన్నది వాస్తవం. లావు ఎంపీగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని అప్పట్లోనే రజనీ రాజకీయం చేశారు. అంతేకాదు.. లావును ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక, లావు అనుచరులపై పలు సందర్భాల్లో దాడులు కూడా జరిగాయన్నది వాస్తవం. తన నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా.. తన అనుమతి తప్పని సరి అని అప్పట్లో రజనీ ఆంక్షలు విధించడం కూడా గమనార్హం. ఈ పరిణామాలతో లావు అప్పట్లో రాజకీయంగా నలిగిపోయారన్నది కూడా నిజం. అదే ఇప్పుడు రాజకీయంగా ఇరువురి మధ్య వివాదానికి.. దారితీసిందన్నది నిజం.