లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అమెరికాలో అరెస్ట్!
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖీ హత్య జరిగినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 Nov 2024 5:14 PM GMTమహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖీ హత్య జరిగినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాబా సిద్ధీఖీ హత్య కేసులోని నిందితులు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు! ఈ సందర్భంగా ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు కీలక భూమిక పోషించాడని చెప్పినట్లు కథనాలొచ్చాయి!
ఇదే సమయంలో... కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా ఇతడిపై పలు కేసుల్లో ఆరోపణలు ఉన్నాయి. 2022లో హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ అన్మోల్ అనుమాతినుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు అమెరికాలో అరెస్టైనట్లు తెలుస్తోంది.
అవును... జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, పరారీలో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ ను సోమవారం అమెరికాలో అదుపులోకి తీసుకున్నట్లు కథనాలొస్తున్నాయి. భారతదేశంలో అనేక హై-ప్రొఫైల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అతడిని కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు!
ఈ సమయంలో అన్మోల్ బిష్ణోయ్ ను తొలుత అమెరికా అధికారులు విచారించి.. అనంతరం హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన విచారణ నిమిత్తం కెనడా అధికారులకు అప్పగించవచ్చని అంటున్నారు. అనంతరం భారత అధికారులు అతడి కస్టడీని పొందవచ్చని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు చెబుతున్నాయని అంటున్నారు.
కాగా... 2023లో నకిలీ పాస్ పోర్ట్ ఉపయోగించి కెనడాకు పారిపోయిన అన్మోల్ పై ఈఏడాది జూలైలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ముంబై కోర్టు. ఈ క్రమంలోనే అన్మోల్ ను తమకు అప్పగించాలంటూ అమెరికాకు ముంబై పోలీసులు ప్రతిపాదించిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుందని నివేదికలు రావడం గమనార్హం.
ఇక.. లారెన్స్ బిష్ణోయ్ నిర్వహించే క్రిమినల్ నెట్ వర్క్ లో అన్మోల్ బిష్ణోయ్ కీలకంగా మారాడని అంటున్నారు. ఈ క్రమంలోనే భారత్ లోని అనేక కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అన్మోల్ ను అరెస్ట్ చేసే సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును ఇస్తామంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే!