లారెన్స్ బిష్ణోయ్..30 ఏళ్లు.. 25 కేసులు.. 700 మంది షూటర్లు..
లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న పుట్టాడు. అంటే.. 30 ఏళ్ల లోపు వయసుకే పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు.
By: Tupaki Desk | 13 Oct 2024 8:30 AM GMTమహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పోలీసులు కూడా ఇదే నిర్ధారణ చేశారు. అసలు ఇంతకూ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..? ముంబైలో ఒకప్పటి మాఫియాను మళ్లీ తీసుకొచ్చాడని చెబుతన్న బిష్ణోయ్.. నేపథ్యం ఏమిటి..? బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నే హత్య చేసేంతగా ప్లాన్ వేయడం ఏమిటి..? ఇప్పుడు సిద్దిఖీనీ చంపేయడం వెనుక కారణం ఏమిటి..? ఇలా అనేక ప్రశ్నలు..
ఎక్కడి పంజాబ్.. ఎక్కడి ముంబై..?
లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న పుట్టాడు. అంటే.. 30 ఏళ్ల లోపు వయసుకే పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. హత్యలు, కిడ్నాప్ లు సహా ఇప్పటికే 25 పైగా కేసులున్నాయి. గత ఏడాది హరియాణా ఇంటిలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడి చేసిన కేసు వీటిలో ఒకటి. మరో కీలక విషయం ఏమంటే.. బిష్ణోయ్ గ్యాంగ్ లో 700 మంది షూటర్లు ఉన్నారట. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పుట్టాడు బిష్ణోయ్. ఇతడి తండ్రి హరియాణాలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్. అయితే, అతడి తండ్రి తర్వాతి కాలంలో ఉద్యోగం వదిలి రైతుగా మారాడు.
గోల్డీ బ్రార్ తో స్నేహం..
బిష్ణోయ్ 2010లో ఇంటర్ పూర్తయ్యాక చండీగఢ్ లోని డీఏవీ కాలేజీలో చేరాడు. పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ లో 2011లో చేరాడు. అక్కడే అతడి జీవితం మలుపు తిరిగింది. గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ పరిచయం అయ్యాడు. విద్యార్థి రాజకీయాల నుంచి నేరాల బాట పట్టాడు. అయితే, పంజాబ్ యూనివర్సిటీ నుంచి బిష్ణోయ్ ఎల్ఎల్బీ పూర్తిచేయడం గమనార్హం. విద్యార్థి రాజకీయాల మధ్యనే.. హత్యలు, దాడులు, దోపిడీలు, కిడ్నాప్ ఆరోపణలతో 2010-2-12 మధ్య బిష్ణోయ్ పై అనేక ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. చండీగఢ్ లో ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదవగా.. నాలుగింటిని కొట్టేశారు. మరో మూడు పెండింగ్ లో ఉన్నాయి.
జైల్లోనే నేర సామ్రాజ్యం
లారెన్స్ బిష్ణోయ్ వివిధ కేసుల్లో జైలుకెళ్లి.. కటకటాల వెనుక ఉంటూనే నేరగాళ్లతో గ్యాంగ్ లను స్థాపించాడు. విడుదల అనంతరం ఆయుధాల డీలర్లు, స్థానిక నేరగాళ్లను కలిశాడు. పంజాబ్ వర్సిటీలో ఉండగానే ఇతడి గ్యాంగ్ సైజ్ పెరుగుతూ పోయింది. 2013 అనంతరం లిక్కర్ దందాలోకి ప్రవేశించిన బిష్ణోయ్.. తరచూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడు. హత్యలు చేసినవారికి ఆశ్రయం ఇవ్వడం మొదలుపెట్టాడు.
సల్మాన్ జింక.. మూసేవాలా హత్య..
సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లో కృష్ణ జింకలను హత్య చేయడం లారెన్స్ కు ఇష్యూలా మారింది. కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగకు చాలా సెంటిమెంట్. లారెన్స్.. పంజాబ్ కు చెందిన సిద్ధూ మూసేవాలాను హత్య చేయడం ఉత్తర భారతంలో ప్రకంపనలు సృష్టించింది. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ గ్యాంగ్ లు యాక్టివ్ గా లేవు. రవి పూజారి, షకీల్ లాంటి వాళ్లకు ద్వితీయ శ్రేణి లీడర్లుగా మాత్రమే పేరుంది. భారీగా సొంత గ్యాంగ్.. పెద్దపెద్ద వారి హత్యకు పన్నాగాలతో ఇప్పుడు నయా లీడర్ ఆఫ్ అండర్ వరల్డ్.. లారెన్స్ బిష్ణోయ్ అంటున్నారు.
ప్రస్తుతం తిహార్ జైల్లో..
మోకా చట్టం అరెస్టయిన బిష్ణోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. వాయిస్ ఓవర్ ఐపీ కాల్స్ తో గ్యాంగ్ ను సమన్వయం చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గోల్డీ బ్రార్ తో కలిసి ఖలీస్ధానీ సానుభూతి పరుడిగా వ్యవహరిస్తున్నాడని ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు ఐదు రాష్ట్రాల్లో 700 మందిపైగా షూటర్లున్నారు. దేశం బయటా కొందరు పనిచేస్తున్నారు.