Begin typing your search above and press return to search.

బిష్ణోయ్ కమ్యునిటీకి కృష్ణజింకలు ఎందుకు అంత ముఖ్యమైనవి?

అవును... బిష్ణోయ్ కమ్యునిటీ ప్రజానికానికి ప్రకృతి ఆరాధన, వన్యప్రాణుల సంరక్షణ పట్ల మిక్కిలి ప్రేమ అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   15 Oct 2024 1:33 PM GMT
బిష్ణోయ్  కమ్యునిటీకి కృష్ణజింకలు ఎందుకు అంత ముఖ్యమైనవి?
X

ముంబైలో మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధీఖ్ హత్య అనంతరం... "సల్మాన్ ఖాన్ - కృష్ణ జింక - వైష్ణోయ్ కమ్యునిటీ" లకు సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బిష్ణోయ్ కమ్యునిటీలకు కృష్ణజింకలపట్ల ఉన్న ఆరాధనాబావం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అసలు ఎందుకు వారికి ఈ జింకలతో అంత బాడింగ్ అనేది ఇప్పుడు చూద్దాం...!

అవును... బిష్ణోయ్ కమ్యునిటీ ప్రజానికానికి ప్రకృతి ఆరాధన, వన్యప్రాణుల సంరక్షణ పట్ల మిక్కిలి ప్రేమ అని చెప్పాలి. వాస్తవానికి జోధ్ పూర్ లోని బిష్ణోయ్ లు కృష్ణజింకలను వారి ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుని పునర్జన్మగా భావిస్తుంటారు. జంభేశ్వరుని జంబాజీ అని కూడా పిలుస్తారు. దీంతో... ఈ జింకలను రక్షించడానికి బిష్ణోయులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని చెబుతారు.

ఈ నేపథ్యంలోనే అడవి జంతువులను చంపడాన్ని, చెట్టును నరకడాన్ని బిష్ణోయ్ కమ్యునిటీ ప్రజలు ఏమాత్రం సహించరు. 15వ శతాబ్ధంలో 29 ఆజ్ఞలతో గురు జంభేశ్వర్ బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. గురు జంభేశ్వర్ అనే బోధకుడు ఈ శాఖను స్థాపించినట్లు చెబుతారు. బిష్ణోయ్ అనే పదం బిష్ణోయిల ప్రధాన దేవత అయిన విష్ణువు ఉత్పన్నం అని కొందరు బలంగా నమ్ముతారు.

మరోపక్క స్థానిక రాజస్థానీ మాండలికంలో బిష్ (ఇరవై), నోయి (తొమ్మిది) అని అర్ధంతో.. జభేశ్వర్ నిర్ధేశించిన 29 ఆజ్ఞల జాబితాను సూచిస్తుందని.. ఈ ఆజ్ఞలను బిష్ణోయ్ లు అందరూ అనుసరించాలని చెబుతుంటారు. జంతువులు, ప్రధానంగా అంతరించిపోతున్న కృష్ణజింకల రక్షణ కోసం వారు ఎన్ని త్యాగాలైనా చేస్తారు.. ఈ జీవిని రక్షించడానికి తమ ప్రాణాలను కూడా త్యాగం చేస్తారని అంటారు!

2016లో రాజస్థాన్ లో వన్యప్రాణుల నేరాలకు పాల్పడిన సుమారు 1700 మందికి పైగా నిందితులు ఈ సంఘం ప్రయత్నాల కారణంగా అరెస్ట్ అయ్యారని నివేదికలు చెబుతున్నాయి!