Begin typing your search above and press return to search.

కళ్లెదుటే మృత్యువు కనిపించి.. క్షణాల్లో కాలి బూడిద.. టైటాన్‌ సబ్ మెరైన్ విషాదం

ఈ ప్రమాదంలో ఓషన్ గేట్ సంస్థపై కోర్టు కేసులు నమోదయ్యాయి. వాటి విచారణ సందర్భంగా విస్తుపోయే అంశాలు తేలాయి.

By:  Tupaki Desk   |   8 Aug 2024 9:35 AM GMT
కళ్లెదుటే మృత్యువు కనిపించి.. క్షణాల్లో కాలి బూడిద.. టైటాన్‌ సబ్ మెరైన్ విషాదం
X

నిరుడు జూన్ లో జరిగిన టైటాన్ మినీ జలాంతర్గామి ప్రమాదం గుర్తుందా..? పాకిస్థాన్ కు చెందిన దిగ్గజ వ్యాపారి, ఆయన కుమారుడు ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.. ఇంకో విషయం.. వందేళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌకను చూసేందుకు.. నాటి టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువు తాలూకు వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు.. ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహించిన ఈ ప్రయాణం అత్యంత విషాదభరితంగా మారిపోయింది. కనీసం చనిపోయినవారి శరీరాలు దొరకనంత విషాదం..

డొక్కు జలాంతర్గామి

అట్లాంటిక్‌ మహా సముద్రంలోకి ప్రయాణం.. అది కూడా ఎంతో లోతులోకి.. కానీ, ఓషన్ గేట్ అనే సంస్థ వాడిన ‘టైటాన్‌’ అనే సబ్ మెరైన్ కు ఆ స్థాయి సామర్థ్యం లేదని స్పష్టమైంది. గతంలోనూ ఓసారి దానితో సమస్యలు వచ్చాయని చెబుతారు. దాని సామర్థ్యం ఎంత? అనేదీ బయటకు చెప్పలేదట. ఇప్పుడు మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఓషన్ గేట్ సంస్థపై కోర్టు కేసులు నమోదయ్యాయి. వాటి విచారణ సందర్భంగా విస్తుపోయే అంశాలు తేలాయి.

డెత్ టూరిజం.. గంటన్నరలోనే..

అట్లాంటిక్‌ లో 112 ఏళ్ల కిందట టైటానిక్‌ నౌక మునిగింది. దాని శకలాలను చూడడాన్ని టూరిజంగా మార్చింది ఓషన్ గేట్. ఇలా టైటాన్ అనే సబ్ మెరైన్ లో బ్రిటన్ వ్యాపారి, సాహస యాత్రికుడు హమీష్‌ హార్డింగ్‌, పాకిస్థాన్‌ అపర కుబేరుడు షాజాదా దావూద్‌, అతడి కొడుకు సులేమాన్‌, మరో ఇద్దరు, ఫ్రాన్స్‌ కు చెందిన పైలట్‌ పాల్‌ హెన్రీ, మరొకరు నిరుడు జూన్ 18న ప్రయాణం అయ్యారు. వీరితో పాటు ఓషన్ గేట్ సీఈవో, సబ్ పైలట్ కూడా ఉన్నారు. టైటాన్.. సముద్రంలోనే పేలిపోయింది. అది కూడా టైటానిక్‌ కు 488 మీటర్ల అత్యంత సమీప దూరంలో. ఇక టైటాన్ లో ఉన్నవారికి తమకు మరణం తప్పదనే విషయం ముందే తెలిసిందట. ఈ ప్రమాదంలో హెన్రీ మరణానికి పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్ వాదనకు వచ్చింది. ఓషన్ గేట్ సంస్థ మినీ జలాంతర్గామికి సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టిందని హమీష్ కుటుంబం తరఫు లాయర్ వాదించారు. హమీష్, షాజాదా తదితరులు ప్రయాణమైన గంటన్నరలోనే టైటాన్ బయటినుంచి ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరింది. దీంతో అందులోనివారికి తమ పరిస్థితి అర్థమైంది. టైటాన్ సిబ్బందికి మరణం ఖాయమని తేలిపోయింది.

లోతుకెళ్లే కొద్దీ ప్రాణాలు పణం..

జలాంతర్గామి లోతుకు వెళ్లే కొద్దీ నీటి బరువు పెరిగి టైటాన్‌ కార్బన్‌ ఫైబర్‌ పగలడం మొదలైంది. దానితాలూకు చప్పుడు లోపల ఉన్నవారికి స్పష్టంగా వినిపించే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో టైటాన్‌ లో కమ్యూనికేషన్‌, కరెంట్ పోయింది. అప్పటికీ వారు సముద్రం లోలోపలకు వెళ్తూనే ఉన్నారు. చివరికి టైటాన్ కార్బన్ ఫైబర్ నీటి ఒత్తిడి తట్టుకోలేక ముక్కలైపోయింది. టైటాన్‌ లో వాడిన కీలక పరికరాల గురించి కూడా కేసులో ప్రస్తావించారు. టైటాన్‌లోని లోపాలను హెన్రీకి చెప్పలేదని ఆరోపించారు. హెన్రీ కుటుంబం 50 మిలియన్‌ డాలర్ల పరిహారం కోరుతోంది. హెన్రీ నిక్ నేమ్ ‘మిస్టర్‌ టైటానిక్‌’ కావడం గమనార్హం. రికార్డు స్థాయిలో అతడు 37 సార్లు సముద్రంలోని టైటానిక్‌ వద్దకు వెళ్లి వచ్చాడు.