Begin typing your search above and press return to search.

పవన్ తో లక్ష్మణ్, కిషన్... తెలంగాణలో జనసేనతో బీజేపీ!

ఇందులో భాగంగా గత బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Oct 2023 10:43 AM GMT
పవన్  తో లక్ష్మణ్,  కిషన్... తెలంగాణలో జనసేనతో బీజేపీ!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. తదనుగుణంగా కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల విషయంలో దూసుకుపోతుంది. అయితే మరోపక్క బీజేపీ మాత్రం కాస్త వెనుకబడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అది వెనుకబడటం కాదు.. స్లో అండ్ స్టడీ వ్యూహం అని అంటున్నారు. ఈ క్రమంలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నారని అంటున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ తో బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యారు!

అవును... ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో ములాకత్ అనంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారాహి నాలుగో యాత్రలో భాగంగా... ఎన్డీయే తో బయటకు వచ్చినట్లు ప్రకటించినా... తర్వాత తాను ఎన్డీయే నుంచి బయటకు వస్తే చెబుతానని చెప్పుకొచ్చారు! ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్, ఎన్డీయే లో ఉన్నట్లే భావిస్తున్న తరుణంలో... టీ.బీజేపీ పొత్తు ప్రయత్నాలు షురూ చేసింది!

ఇందులో భాగంగా గత బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో... పవన్ కూడా సానుకూలంగా స్పందించారని, జనసేనకు 30 సీట్లు ఇవ్వాలని కోరినట్లు సమచారం! ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు విషయమై లక్ష్మణ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో జనసేనతో పొత్తువిషయంపై తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తాజాగా స్పందించారని తెలుస్తుంది! ఇందులో భాగంగా... తెలంగాణలో జనసేనకు ఇచ్చే సీట్లపై కసరత్తు చేస్తున్నామని.. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని, జనసేనకు బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనా ఉందని తెలిపారని తెలుస్తుంది! దీంతో... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలుమెండుగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

దీంతో... బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో అందుకే ఆలస్యం చేస్తుందా అనే చర్చ మొదలైంది. మరోపక్క పవన్ అడుగుతున్న 30 సీట్లు కాకపోయినా.. కనీసం అందులో సగమైనా ఇచ్చేలా లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... జనసేనకు టీ.బీజేపీ 10 నుంచి 12 సీట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. వీటిలో ఖమ్మంలో 8, నల్లగొండలో 2, హైదరాబాద్, వరంగల్ లలో ఒక్కో సీటు జనసేనకు ఇవ్వాలని టీ.బీజేపీ భావిస్తుందని అంటున్నారు.

కాగా... తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తున్నట్లు జన్సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల పేర్లు ప్రకటించనప్పటికీ... ముందుగా నియోజకవర్గాల పేర్లు అయితే ఆ పార్టీ ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో 32 కాదు కానీ 12 అని తెలంగాణ బీజేపీ అంటే అందుకు జనసేన ఒప్పుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

మరోపక్క... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రావొచ్చని లక్ష్మణ్‌ వెల్లడించారు. 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. ఇందులో భాగంగా... తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.