అప్పుడు వాడుకొని.. ఇప్పుడు వద్దంటే ఎలా..?
కొన్ని సంస్థలేమో ఆర్థికంగా నష్టపోతే.. మరికొన్ని మాత్రం అందుబాటులోకి వచ్చిన ఏఐ సేవలతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 21 Nov 2024 7:12 AM GMTప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఎప్పుడైతే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి చుట్టుముట్టిందో అప్పటి నుంచి కంపెనీలు దివాల తీస్తూ వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దానికీ కారణాలు లేకపోలేదు. కొన్ని సంస్థలేమో ఆర్థికంగా నష్టపోతే.. మరికొన్ని మాత్రం అందుబాటులోకి వచ్చిన ఏఐ సేవలతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి.
తాజాగా.. ప్రపంచంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన జనరల్ మోటార్స్ కూడా ఈ దిశగా ఆలోచన చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు ఆ కంపెనీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతోందని, ఇందులో అధికంగా పెట్టుబడులు అవసరం ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ ప్రయత్నం చేస్తున్నదని చెప్పింది.
భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకే భారీ గిరాకీ ఏర్పడుతుంది. వాటిని తయారు చేసేందుకు, అందులో వాడే సాఫ్ట్‌వేర్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాదిలోపే కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్లు (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు (రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ పోటీ మార్కెట్లో నిలవాలంటే ఈ నిర్ణయాలు తప్పవని తెలిపింది. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. దిగ్గజ కంపెనీ ఒక్కసారిగా లేఆఫ్ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులంతా ఆందోళనలో పడిపోయారు. సడన్‌గా తీసుకున్న నిర్ణయంతో తమ భవిష్యత్తును తలచుకొని మదన పడుతున్నారు. ఇదే క్రమంలో 40 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, వయసులో ఉన్నప్పుడు వాడుకొని.. ఇప్పుడు ఓల్డ్ ఏజ్‌లో వద్దంటే ఎలా అని నిలదీశాడు.