Begin typing your search above and press return to search.

రిలయన్స్ లో ఆ 42,000 మంది ఉద్యోగులు ఏమైనట్లు?

ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ కూడా భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 6:55 AM GMT
రిలయన్స్  లో ఆ 42,000 మంది ఉద్యోగులు ఏమైనట్లు?
X

మాంద్యం ముంచుకొచ్చేసిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న వేళ పలు కంపెనీల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో జాబ్స్ పోయిన ఉద్యోగస్తులంతా రోడ్లపై పడుతున్నారనే కామెంత్లు వినిపిస్తున్నాయి. సుమారు వారం రోజుల క్రితం ప్రముఖ టెక్ దిగ్గజం "డెల్" సుమారు 12,500 మందికి షాక్ ఇచ్చిందనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ కూడా భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది.

అవును... మాద్యం ముంచుకొచ్చేసినట్లే అనే చర్చ ప్రస్తుతం బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి! భారీ సంఖ్యలో ఉద్యోగులకు గుడ్ బై చెప్పేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలయన్స్ సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను సుమారు 42 వేల వరకూ తగ్గించుకుందని తెలుస్తోంది. అలా అని ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు!

కానీ... ఇటీవల కంపెనీ ప్రకటించిన పలు వివరాల ప్రకారం 2023 - 24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఆ కంపెనీకి 3,89,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఆ ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చే సరికి వారి సంఖ్య 3,47,000 గా చెబుతున్నారు. దీంతో... మరి మిగిలిన 42వేల మంది ఉద్యోగులు ఏమయ్యారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ ఇంటికి పంపించేశారని అంటున్నారు.

మరోపక్క రిలయన్స్ రిటైల్ విభాగంలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో 2,07,000 మంది ఉద్యోగులు ఉన్నారని.. అంతకు ముందు ఏడాది వీరి సంఖ్య 2,45,000 గా ఉందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... 2023-24లో జియో ఉద్యోగుల సంఖ్య 90,000 ఉండగా... అంతక ముందు ఏడాది వారి సంఖ్య 95,000 గా ఉండేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాద్యం ఎఫెక్ట్ వల్లే రియలన్స్ ఈ ఆలోచన చేసిందని చెబుతున్నారు పరిశీలకులు.