ఎల్బీ నగర్ ఓటర్ కు ఓటేయాలంటే తిప్పలు ఎన్నంటే?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లకు.. అభ్యర్థులకు కొత్త ఇబ్బంది తెర మీదకు వచ్చింది
By: Tupaki Desk | 17 Nov 2023 4:28 AM GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లకు.. అభ్యర్థులకు కొత్త ఇబ్బంది తెర మీదకు వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసి.. ఎంత మంది అభ్యర్థులు రేసులో ఉంటారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. అత్యధిక సంఖ్యలో ఎల్ బీ నగర్ బరిలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తేలింది. దీంతో.. అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలు కాగా.. ఓటేసే ఓటర్లకు కొత్త తలనొప్పి ఖాయమన్న మాట వినిపిస్తోంది.
దీనికి కారణం.. భారీగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటమే. ఎందుకిలా? అంటే.. ఇప్పుడు ఓటేసేందుకు ఈవీఎంలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది అభ్యర్థుల పేర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. పోటీ చేస్తున్న 48 మంది అభ్యర్థులతో పాటు నోటాను కలుపుకుంటే 49 బరిలో ఉన్నట్లుగా చెప్పాలి. దీంతో.. ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలకు మొత్తం నాలుగు బ్యాలెట్ యూనిట్లను ఉపయోగించాల్సి వస్తుంది. పదహారు చొప్పున.. మొత్తం 48 లెక్కన చూస్తే.. మూడు ఈవీఎంలు ఉంటాయి. నోటాతో కలుపుకున్నప్పుడు 49 కావటంతో.. మొత్తం నాలుగు ఈవీఎంలను అందుబాటులో ఉంచాల్సి వస్తుంది.
దీంతో.. ఎన్నికల బరిలోఉన్న అభ్యర్థుల్లో తమ వారు ఎవరు కనుక్కునే విషయంలో ఓటర్లకు ఇబ్బందిరి మారటం ఖాయమంటున్నారు. అంతేకాదు.. ఇంత భారీగా బ్యాలెట్ ఉండటం అభ్యర్థులకు సైతం టెన్షన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఎల్ బీ నగర్ ఓటర్లకు ఓటు వేసే సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఓటు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు పదిహేను అంతకంటే తక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాలు సంఖ్య దాదాపు 54 ఉండగా.. 16 - 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు దాదాపు 55 వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండేసి చొప్పున ఈవీఎంలను వినియోగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక.. 32 నుంచి 47 వరకు అభ్యర్థుల ఉన్న నియోజకవర్గాలు తొమ్మిది. ఇక్కడ ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులకు తగ్గట్లే పెద్ద ఎత్తున ఈవీఎంలు ఏర్పాటు చేయల్సి ఉంటుంది.