షర్మిలకు షాకిచ్చేలా ఆ పార్టీ నేత రాజీనామా
అలాంటి కొండా రాఘవరెడ్డి కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
By: Tupaki Desk | 1 Sep 2023 5:25 PMవైఎస్ షర్మిల తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తో చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆమె రెండున్నరేళ్ల వైఎస్సార్టీపీని హస్తం పార్టీలో విలీనం చేయాలని చూస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ వైఎస్సార్టీపీలో ఉన్న నేతల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉండనే ఉంది.
ఆ పార్టీలో ఉన్న వారిలో పెద్ద దిక్కుగా ఉన్న నేత కొండా రాఘవరెడ్డి. ఆయన సీనియర్ మోస్ట్ నేత. గతంలో వైఎస్సార్సీపీలో తెలంగాణా ప్రెసిడెంట్ గా పనిచేసిన నేత. ఆయన షర్మిల పార్టీ పెట్టడంతో అందుకో చేరి అండగా ఉంటూ వచ్చారు.
అలాంటి కొండా రాఘవరెడ్డి కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలా ఎలా చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్సార్ ఫ్యామిలీని అన్ని రకాలా ఇబ్బందులు పెట్టిన పార్టీలో ఎలా వైఎస్సార్ బిడ్డ చేరుతుంది అని మండిపడ్డారు.
వైఎస్సార్ టీపీని నడుపుతామంటే తాము వచ్చి చేరామని, షర్మిల తన దారి తాను చూసుకుంటే తాము ఎందుకు ఆ పార్టీలో ఉండాలని ఆయన ఫైర్ అయ్యారు. ఏకంగా ఒక టీవీ లైవ్ డిబేట్ లో ఆయన తన రాజీనామాను చూపించారు. అక్కడికక్కడే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం విశేషం.
వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ దెబ్బ తీసిందని అలాంటి కాంగ్రెస్ లో షర్మిల ఎందుకు చేరుతున్నారని ఆయన నిలదీస్తున్నారు. ఇది కచ్చితంగా తెలంగాణాలో ఉన్న వైఎస్సార్ అభిమానులను కూడా ఆలోచింపచేస్తుంది అని అంటున్నారు. అంతే కాదు గతంలో రాజీవ్ గాంధీ చనిపోతే ఆయన మీద పెట్టిన బోఫోర్స్ కేసులో పేరు తీసివేశారని, అలాంటిది వైఎస్సార్ దివంగతులు అయ్యాక ఆయన పేరును ఎఫ్ ఐ ఆర్ లో చేర్చి ఆయన ప్రతిష్టకు తీరని మచ్చ తెచ్చింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ కి తాను బద్ధ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ తో ఉంటామని, షర్మిల వెంట తాను ఆ పార్టీలో చేరి రాజకీయాలు చేయలేనని కొండా రాఘవరెడ్డి తెగేసి చెప్పారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి కొత్త రాజకీయం మొదలెడదామని చూస్తున్నా షర్మిలకు ఇది గట్టి షాక్ గానే చూస్తున్నారు. కొండా రాఘవరెడ్డి వైఎస్సార్ అభిమానులకు ఐకాన్ లాంటి వారు అలాంటి వారే కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనాన్ని వ్యతిరేకిస్తే ఇక వైఎస్సార్ అభిమానుల ఆలోచనలు ఎలా ఉంటాయో వేరేగా చెప్పల్సింది లేదు అంటున్నారు.