తరువాత అరెస్ట్ ఆయనదేనా ?
కానీ ఇపుడు సడెన్ గా హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకుని రావడం చూస్తూంటే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 1:30 PM GMTఏపీలో వైసీపీ బిగ్ షాట్స్ అరెస్టులకు రంగం సిద్ధం అయింది. టీడీపీ కూటమి ఏర్పాటు అయిన ఎనిమిది నెలల తరువాత ఒక బిగ్ షాట్ ని అరెస్ట్ చేయడం విశేషం. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ క్రిష్ణా జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో ఒక దశలో వంశీని అరెస్టు చేస్తారని అనుకున్నారు ఆ తరువాత సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇపుడు సడెన్ గా హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకుని రావడం చూస్తూంటే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అని అంటున్నారు. నిజానికి వంశీని ఎపుడో అరెస్ట్ చేయాలన్న చర్చ ఉంది. ఆయన గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించారని అభియోగం ఉంది. ఇపుడు మరో కేసులో అరెస్టు జరిగింది. ఇంకా ఆయన మీద కేసులు ఉన్నాయని అంటున్నారు.
ఇక చూస్తే వంశీ టీడీపీలోనే రెండు సార్లు గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన 2009లో విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయన టీడీపీలో ముఖ్య నాయకుడిగా ఉండేవారు. ఆయన అధినాయకత్వానికి సన్నిహితంగా కూడా వ్యవహరించేవారు.
కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అటు వైపు మొగ్గారు. ఆ తరువాత ఆయన టీడీపీ అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పసుపు పార్టీ శ్రేణులు మండిపోయాయి. ఆయన వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారని అప్పట్లో పెద్ద చర్చ సాగింది. మొత్తం మీద వంశీ ఇపుడు అరెస్ట్ అయ్యారు. గన్నవరం ఆఫీసు మీద దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఉంది. కానీ వేరే కేసులో అరెస్ట్ చేయడం ఊహించని పరిణామమే అంటున్నారు.
మరో వైపు చూస్తే వంశీ తరువాత గుడివాడకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని అని టాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. నానిని కూడా గట్టిగానే టీడీపీ టార్గెట్ చేసింది. ఆయన కూడా గుడివాడకు పెద్దగా రావడం లేదు. ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నారు.
కొడాలి నాని కూడా టీడీపీ నుంచి ఎదిగిన నాయకుడే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీలోకి వెళ్ళాక ఆయన టీడీపీ అధినాయకత్వం మీద పెద్ద నోరు చేసుకోవడంతో పసుపు పార్టీ ఆయనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తోంది.
ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు నమోదు అయ్యాయని చెబుతున్నారు. ఇక చూసుకుంటే కొడాలి నాని ప్రధాన అనుచరులను ఇటీవల అరెస్టు చేయడంతో వ్యవహారం నాని దాకా వచ్చేస్తోందని అంటున్నారు. ఇపుడు నాని సన్నిహితుడు వల్లభనేని వంశీ అరెస్టుతో నానిని కూడా తొందరలో అరెస్టు చేస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మొదటి నుంచే ఈ ఇద్దరి మీద చర్యలకు టీడీపీ నుంచి డిమాండ్ వస్తోంది. ఎట్టకేలకు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. ఇక కొడాలి వంతు అనే అంటున్నారు. నాలుగు సార్లు గుడివాడ లో గెలిచిన నానిని తొలిసారి ఓడించింది టీడీపీ. ఇపుడు అరెస్ట్ చేయడం ద్వారా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అన్న సందేశం ఇవ్వడానికి టీడీపీ పెద్దలు చూస్తున్నారు. మొత్తం మీద వల్లభనేని అరెస్టు తో అందరి చూపూ కొడాలి నాని మీద పడింది అని అంటున్నారు.