Begin typing your search above and press return to search.

జైలుకెళ్ళు బాసూ.. సీఎం సీటు పట్టు !

అదే సెలిబ్రిటీలు జైలులో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక్కటే. పైగా వారికి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ కూడా వస్తుంది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 2:52 PM GMT
జైలుకెళ్ళు బాసూ.. సీఎం సీటు పట్టు !
X

జైలు అంటే ఏమీ తీసిపారేయాల్సింది లేదు. అసలు ఈ జీవితమే పెద్ద జైలు అని తలలు పండిన మహా కవులు ఏనాడో చెప్పారు. అలాంటిది మనిషి సృష్టించిన జైలు అంటే భయం గియం అసలు ఎందుకు అని అంటున్నారు. మామూలు జనాలు జైలుకు వెళ్ళినా టైం కి ఫుడ్డు వంటివి అన్నీ సమకూరుతాయి.

అదే సెలిబ్రిటీలు జైలులో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక్కటే. పైగా వారికి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇక పొలిటికల్ జనాలు జైలుకు వెళ్తే తడిసి మోయేలేనంత సెంటిమెంట్ కురుస్తుంది. అయ్యో పాపం అంటారు జనాలు. ఏమి పాపం చేశారని జైలులో వేశారని కరిగి కన్నీరు అవుతారు.

అందువల్ల జీవితంలో జైలుకు వెళ్ళిన ఏ రాజకీయ నేత కూడా ఓడిపోలేదు, వాడిపోలేదు. పైగా జైలుకు వెళ్ళి వచ్చాకా జనాలు బ్రహ్మాండమైన అధికార సింహాసనం సిద్ధం చేసి మరీ అప్పగిస్తారు. ఇది పవర్ ఫుల్ సెంటిమెంట్ గా మారింది. ఈ మధ్యనే తెలంగాణాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కూడా అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అని అధికార పక్షానికి సవాల్ విసిరారు

ఇక జైలుకి వెళ్ళి వచ్చిన వారంతా ఆ తరువాత కాలంలో ఏకంగా అధికారాలు అందుకుని ఒక్క లెక్కన వెలిగిపోయారు. గడచిన పదేళ్లలో దేశ రాజకీయాల్లో చూసుకుంటే వైఎస్ జగన్ జైలుకు వెళ్ళి వచ్చాకనే ఆయన ఇమేజ్ దారుణంగా పెరిగిపోయింది. ఏపీకి సీఎం అయ్యారు.

అలాగే ఏనాడూ కోర్టు మెట్లు ఎక్కని చంద్రబాబుని 53 రోజుల పాటు వైసీపీ ప్రభుత్వం జైలులో ఉంచింది. అంతే టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని మెజారిటీతో గెలిచి చంద్రబాబు తిరుగులేని నేతగా ఏపీకి నాలుగోసారి సీఎం అయిపోయారు. అదే విధంగా 2016 ప్రాంతంలో రేవంత్ రెడ్డిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జైలు పాలు చేసింది.

ఆ తరువాత ఆయన పాపులారిటీ ఇంతకు వేయింతలుగా అన్నట్లుగా పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి మొత్తానికి తాను అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యారు. కేసీఆర్ ని దించేసి మరీ తెలంగాణాకు రెండవ సీఎం అయిపోయారు. ఇక లేటెస్ట్ గా చూస్తే జార్ఖండ్ ఫలితాలలో జేఎంఎంకి చెందిన హేమంత్ సోరెన్ మరోసారి సీఎం అవుతున్నారు.

అవినీతి ఆరోపణల మీద ఆయనను గత ఏడాది జైలుకు పంపించారు. అయితే జైలు నుంచి వచ్చిన తరువాత ఆయన పార్టీని జనాలు విపరీతంగా ఆదరించారు. దాంతో మళ్లీ మీరే ముఖ్యమంత్రి అని పీఠాన్ని ఆయనకు అప్పగించారు. ఈ పరిణామం చూసిన వారంతా జైలుకు వెళ్తే ఇక సీఎం సీటు పట్టేసినట్లే అంటున్నారు. గత దశాబ్ద కాలంలో ఈ విధంగా జైలుకు వెళ్ళి వచ్చి సీఎం అయిన నాలుగవ నేతగా హేమంత్ సోరెన్ నిలిచారు.

జైలు సెంటిమెంట్ మీద చాలా కాలం క్రితమే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విశ్లేషించారు. జైలుకు వెళ్ళడానికి భయం ఎందుకు అని కూడా ఆయన ప్రశ్నించారు. జైలుకు వెళ్తే ఏమీ కాదని అధికార అందలమే దక్కుతుందని కూడా అన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం వైసీపీ తప్పిదంగా కూడా చాలా మంది విశ్లేషించారు. ఆయన తప్పకుండా సీఎం అవుతారు అని కూడా ముందే జోస్యం చెప్పిన వారు ఉన్నారు.

ఇపుడు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అరెస్టులు జైలు అన్న చర్చ సాగుతోంది. ఏ నేత అరెస్ట్ అవుతారు ఎవరు జైలుకు వెళ్తారు అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. కేటీఆర్ మీద కేసులు పెట్టి జైలులో వేస్తారా అన్నది ఒక చర్చ అయితే జగన్ మీద ఏసీబీ కేసులు పెట్టి ఆయనకు జైలు దారి చూపిస్తారు అని మరో చర్చ సాగుతోంది. అంటే జగన్ కనుక అరెస్టు అయి జైలుకు వెళ్తే ఇది రెండోసారి అని అంటున్నారు. ఇక కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అన్నది మరో చర్చ. ఆయన అరెస్ట్ అయితే గులాబీ పార్టీకి మేలు జరిగినట్లేనా అన్నది మరో చర్చగా ఉంది.

మొత్తం మీద చూసుకుంటే జైలుకు వెళ్తే సెంటిమెంట్ ప్రకారం వారికి మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. అయితే బయట పార్టీని జనంలోకి తీసుకుని పోయే యంత్రాంగం ఉండాలి. ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునే వ్యూహాలు ఉండాలి. అవేమీ లేకుండా జైలుకు వెళ్తే మాత్రం ఊచలు లెక్కబెట్టడం తప్ప ఒనగూడే అదనపు ప్రయోజనం అయితే ఏమీ ఉండదనే అంటున్నారు.