ఎన్నికల నేపథ్యంలో ఈవెంట్ మేనేజర్లకు భారీ ఎత్తున డిమాండ్!
ప్రస్తుతం నాయకులకు స్వల్ప సమయం ఉండడం.. ఎన్నికల నామినేషన్ల గడువు వస్తుండడంతో కార్యక్ర మాలు నిర్వహించేవారు సతమతమవుతున్నారు.
By: Tupaki Desk | 30 Oct 2023 1:30 PM GMT''మీలో ఈ టాలెంట్ ఉందా.. అయితే.. మీకో అద్భుత అవకాశం.. మా నాయకుడికోసం మీరు కష్టపడితే చాలు.. మీకు కావాల్సినంత సొమ్ములు అందిస్తాం'' ఇదీ.. వివిధ మాధ్యమాల్లో గత నాలుగు రోజులుగా హోరెత్తుతున్న ప్రచారం. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవెంట్ మేనేజర్లకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగింది. దీనికిగాను ఎంత సొమ్మయినా వెచ్చించేందుకు నాయకులు సిద్ధం.
ప్రస్తుతం నాయకులకు స్వల్ప సమయం ఉండడం.. ఎన్నికల నామినేషన్ల గడువు వస్తుండడంతో కార్యక్ర మాలు నిర్వహించేవారు సతమతమవుతున్నారు. దీనికితోడు పోటీ తీవ్రంగా ఉంది. పార్టీలు.. ఒకదానిపై ఒకటి పైచేయి చేసుకుంటున్నాయి. దీంతో కార్యక్రమాల నిర్వహణ కూడా పార్టీల నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో మూస ధోరణి సభలు, సమావేశాలు కాకుండా.. విభిన్నంగా ఆలోచించే వారికి నాయకులు రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కీలక పార్టీల నేతలు ఈవెంట్ మేనేజర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ''కాస్త చతురత.. మాటల్లో మసాలా.. కార్యక్రమాన్ని జిగేల్ మనిపించే నైపుణ్యం.. ఇవి ఉంటే చాలు'' అని నాయకులు కోరుతున్నారు. వారు చేసే ప్రసంగాల మాట ఎలా ఉన్నా.. కార్యక్రమ నిర్వహణ మాత్రం అదిరిపోవాలనే రీతిలో వారు ఉంటున్నారు. దీంతో ఈవెంట్ మేనేజర్లకు తెలంగాణ రాజకీయాలు స్వాగతం పలుకుతున్నాయి.