Begin typing your search above and press return to search.

టికెట్ల కోసంపార్టీలు మారారు? గెలిచిందెవరు? ఓడిందెవరు?

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గెలిచిందెవరు? ఓడిందెవరు? అన్న క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలెన్నో.

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:29 AM GMT
టికెట్ల కోసంపార్టీలు మారారు? గెలిచిందెవరు? ఓడిందెవరు?
X

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గెలిచిందెవరు? ఓడిందెవరు? అన్న క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలెన్నో. గతంలో గెలిచి.. అధికార పార్టీలోకి వెళ్లిన వారుకొందరు అయితే.. ఎన్నికల వేళ.. తాము కోరుకున్న టికెట్లు రాలేదని పార్టీలు మారిపోయిన నేతలు కొందరు. మొత్తంగా పార్టీ మారిన వారిలో గెలిచింది ఎంతమంది? ఓడింది ఎంత మంది? వారెవరు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికే క్రమంలో గత ఎన్నికల గురించి కాస్తంత మాట్లాడుకొని ఈ సారి పలితాల్లోకి వెళితే మరింత క్లారిటీ వస్తుంది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్.. అప్పటి టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. 119 స్థానాల్లో దాదాపు75 శాతానికి పైగా సీట్లను సొంతం చేసుకోవటం ద్వారా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. అలాంటి గులాబీ పార్టీ ఈసారి ఎన్నికల్లో మాత్రం 39 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్నప్పటికీ.. శత్రుశేషం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీల నుంచి వలసల్ని ప్రోత్సహించారు గులాబీ బాస్. దానికి ఆయన పెట్టుకున్న పేరు.. తెలంగాణ డెవలప్ మెంట్ లో భాగం అయ్యేందుకు తమ పార్టీలోకి వస్తున్నారని. అలా హస్తం గూటి నుంచి బయటకు వచ్చేసి గులాబీ కారులో సీటు దక్కించుకున్నారు.

2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు 19 మంది అయితే.. వారిలో 12 మంది గులాబీ గూటికి వెళ్లిపోయారు.టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ కారులోనే తమ చోటును వెతుక్కున్నారు.కాంగ్రెస్ లో గెలిచి.. తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిలో తాజాగా మళ్లీ ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినోళ్లు ఇద్దరు మాత్రమే. వారిలో ఒకరు మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి. ఎల్ బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సబితకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె తన సమీప బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ను 26,320 ఓట్ల తేడాతో ఓడించారు.

ఎల్బీ నగర్ నుంచి గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి ఈసారి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి పైన 22,312 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి మూడో స్థానంలో నిలిచారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి గులాబీ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. తాజా గెలుపుతో ఆ లోటు తీరిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది.. టీఆర్ఎస్ లోకి మారిన ఎమ్మెల్యేల్లో కొందరు టికెట్లు దక్కించుకోలేదు. మరికొందరు దక్కించుకున్నా సబితా.. సుధీర్ రెడ్డి మినహా మరెవరూ గెలవలేదు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2018లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు గులాబీ పార్టీలో చేరినా.. తాజా ఎన్నికల్లో టికెట్ పొందలేదు. ఆయన స్థానంలో బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మరో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి (పాలేరు) ఈసారి అధికార పార్టీ తరఫున పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పొంగులేటి చేతిలో 56వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు).. బీరం హర్షవర్దన్ రెడ్డి (కొల్లాపూర్).. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి).. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్).. రేగా కాంతారావు (పినపాక).. హరిప్రియా నాయక్ (ఇల్లందు).. సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి).. మొచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట) ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నికల్లో చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి విజయం సాధించిన వారెందరో. వారిలో కొందరికి మిశ్రమ ఫలితాలు దక్కాయి. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న మైనంపల్లి హన్మంతరావు తన కొడుక్కి మెదక్ టికెట్ ఇవ్వలేదన్న అగ్రహంతో కాంగ్రెస్ లో చేరి.. రెండు టికెట్లను సొంతం చేసుకున్నారు.కానీ.. ఎన్నికల ఫలితాల్లో మైనంపల్లి హన్మంతరావు ఓడిపోగా.. ఆయన కుమారుడు మెదక్ అసెంబ్లీ నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని నిలపగా.. ఆయన విజయం సాధించారు.

చివరి నిమిషంలో కాంగ్రెస్ లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు).. తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం).. జూపల్లి క్రిష్ణారావు (కొల్లాపూర్).. కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి).. మేఘారెడ్డి (వనపర్తి).. కూచుకళ్ల రాజేశ్ రెడ్డి (నాగర్ కర్నూలు)లు విజయం సాధించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన యెన్నం శ్రీనివాసరెడ్డి (మహబూబ్ నగర్).. గడ్డం వివేక్ (చెన్నూరు).. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు).. రేవూరి ప్రకాశ్ రెడ్డి (పరకాల)లు విజయం సాధించారు. వీరే కాక.. సాయం వెంకటేశ్వర్లు (పినపాక).. కోరం కనకయ్య (ఇల్లెందు).. మందల శామేల్ (తుంగతుర్తి).. వేముల వీరేశం (నకిరేకల్) గెలిచారు.

ఇతర పార్టీల నుంచి వచ్చి గెలుపొందిన వారే కాదు ఓడిన వారు ఉన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి (బాన్సువాడ).. విజయకుమార్ రెడ్డి (ఆర్మూరు).. చంద్రశేఖర్ (జహీరాబాద్).. బండి రమేశ్ (కూకట్ పల్లి).. జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి).. శ్రీహరిరావు (నిర్మల్).. విడతల ప్రణవ్ (హుజురాబాద్).. శ్రామ్ నాయక్ (ఆసిఫాబాద్).. రావి శ్రీనివాస్ (సిర్పూరు).. పురుమల్ల శ్రీనివాస్ (కరీంనగర్)లు ఓటమిపాలయ్యారు.