Begin typing your search above and press return to search.

ఏపీలో గ్రామ, మండల స్థాయిలో టోల్ విధానం!?

ఆ సమయంలో గత ప్రభుత్వం కాస్త కదిలినట్లు అనిపించినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది

By:  Tupaki Desk   |   27 July 2024 7:13 AM GMT
ఏపీలో గ్రామ, మండల స్థాయిలో టోల్  విధానం!?
X

ఏపీలో రోడ్ల దుస్థితి ఎంత పెద్ద హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ప్రధానంగా గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పూర్తిగా ప్రాధాన్యం ఇస్తూ, రోడ్లను పూర్తిగా గాలికి వదిలేసిందనే కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో గతంలో రోడ్ల దుస్తితిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వీటిని బాగుచేసేందుకు శ్రమదానం కార్యక్రమానికీ శ్రీకారం చుట్టారు.

ఆ సమయంలో గత ప్రభుత్వం కాస్త కదిలినట్లు అనిపించినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది! ఈ లోపు ఎన్నికల సమయం రానే వచ్చింది. ఆ ఎఫెక్ట్ ఫలితాలో కళ్లకు కట్టినట్లు కనిపించింది!! ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు & కో రోడ్లను బాగుచేసే విషయంలో సరికొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

అవును... ఏపీలో రోడ్ల పరిస్థితిపై పక్క రాష్ట్రాల నేతలు కూడా కామెంట్ చేసిన పరిస్థితి గతంలో నెలకొంది. అయితే ఇప్పుడు ఏపీలో మౌళిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి పెడతారనే పేరున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో.. రోడ్లను బాగుచేసే విషయంలో ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు ఆయన గ్రామ, మండల స్థాయిలో టోల్స్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది!

ఇందులో భాగంగా... గుంతలు పడిన రోడ్లను ఇప్పటికిప్పిడు బాగుచేసే ఆర్థిక వెసులుబాటు లేదని, అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని అంటున్నారు. ఈ ఆర్థిక సపోర్ట్ కోసమే గ్రామ, మండల స్థాయిలో టోల్ విధానం అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ఈ తాజా సంచలన నిర్ణయం ప్రకారం... ప్రతి పల్లె నుండి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికీ మధ్యలో టోల్స్ వసూల్ చేస్తారు!! అయితే... బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, ఆటోలకు వీటి నుంచి మినహాయింపు ఉంటుందని.. మిగిలిన వాహనాలకు మాత్రం టోల్ వసూలు చేయనున్నారని అంటున్నారు. ఈ ఆదాయం మొత్తం ఆర్ & బీ డిపార్ట్మెంట్ కు చేరుతుందని చెబుతున్నారు!!