ఈ రోజు మాటల తూట: మోడీ..రాహుల్.. కేసీఆర్.. కేటీఆర్.. రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం మరో మూడురోజుల్లో ముగుస్తోంది.
By: Tupaki Desk | 27 Nov 2023 3:56 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం మరో మూడురోజుల్లో ముగుస్తోంది. ఈ నెల 30న ప్రజా తీర్పును నిక్షిప్తం చేసే పోలింగ్ జరుగుతుండగా.. వచ్చే ఆదివారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ ప్రచారాన్ని పెంచేశారు. సుడిగాలి పర్యటనల్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని పలువురు అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ.. తెలంగాణలో పరిమిత స్థానాల్లో పోటీ చేస్తున్నజనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తన ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రియాంక వాద్రా, ఖర్గేలతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా పలువురు ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు తెలంగాణ అధికారపక్ష అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్.. కుమార్తె కవితతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కిపోయేలా ఉంది. తెలంగాణలో ప్రచారం చేస్తున్న ప్రముఖుల్లో ఐదుగురు ముఖ్యనేతల ప్రసంగాల్లోని ముఖ్యమైన అంశాల్ని.. కీలకమైన వ్యాఖ్యల్ని చూస్తే..
ప్రధాని నరేంద్ర మోడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ఆలోచించాలి. ఓటమి భయంతోనే రెండుచోట్ల పోటీ చేస్తున్నారు. బీజేపీ సింహం ఈటల రాజేందర్ ను చూసి కేసీఆర్ భయపడ్డారు. భూ నిర్వాసితుల్నిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్ ను ప్రజలు ఎన్నటికి క్షమించరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగుల్ని మోసం చేశారు.
స్కీముల పేర్లు చెప్పి స్కామ్ లకు పాల్పడిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రజలందరికి కోసం పని చేస్తానని చెప్పి.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబం కోసం పని చేసిన వ్యక్తి. ప్రజల ఆదాయం పెంచుతానని చెప్పి.. తన కుటుంబ ఆదాయాన్ని కోట్లకు పెంచుకున్నారు. ప్రజలను కలవని.. ఎప్పుడూ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?
బీసీల్లో ఎంతో ప్రభావవంతమైన వారు ఉన్నా.. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ధైర్యంగా ప్రకటించింది. తెలంగాణలో మాదికలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ అర్థం చేసుకుంది. త్వరలోనే వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కాంగ్రెస్ సుల్తానులను పెంచి పోషిస్తే.. బీఆర్ఎస్ నిజాంలను పోషించింది.
కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు ప్రతిదాంట్లో 30 శాతం కమిషన్లు తీసుకున్నారు.దేశంలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడితే.. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయి. నీళ్ల పేరు చెప్పి.. నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణను లూటీ చేసిన తర్వాత కేసీఆర్ చూపు దేశం మీద పడింది. దేశాన్ని లూటీ చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. అక్కడ ఒక నేతతో చేతులు కలిపి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు.
రాహుల్ గాంధీ
బీఆర్ఎస్ పాలనలో 8వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఆదాయం మొత్తాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. ల్యాండ్.. సాండ్..మైన్స్.. వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది. ధరణి పోర్టల్ ను గుప్పిట్లో పెట్టుకొని పేదల భూముల్ని గుంజుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో కేసీఆర్ చెప్పగలరా?
దొరల సర్కారుకు.. ప్రజల సర్కారుకు తేడా ఏంటో మేం చెబుతున్నాం. ఆరు గ్యారెంటీలు అమలు చేసి ప్రజల పాలన చూపిస్తాం. తొలి కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడదాం. ప్రధాని మోడీ నాపై 24 కేసులు పెట్టారు. నాఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి పంపించేశారు. అవినీతిపరుడైన కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు లేదు.
బీఆర్ఎస్.. బీజేపీల మధ్య మంచి స్నేహం ఉంది. ఢిల్లీలో మోడీకి కేసీఆర్ సహకరిస్తారు. తెలంగాణలో కేసీఆర్ కు మోదీ సాయం చేస్తారు. రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారు.
కేసీఆర్
కాంగ్రెస్ అధికారంలో ఉన్న యాభై ఏళ్ల దరిద్రాన్ని మా పదేళ్ల పాలనలో తీసేశాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఎలా జరిగిందో.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. గ్రామాల్లో ప్రజలంతా చర్చించి.. అభ్యర్థుల గురించిఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలి.
రైతుల కోసం ఎన్నో కార్యక్రమాల్నిచేపట్టాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. 3 గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి పోర్టల్ తీసేసి బంగాళాఖాతంలో పడేస్తామంటున్నారు. అదే జరిగితే ప్రజలు దెబ్బ తింటారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ధరణికి దండం పెడతారు. దాంతో లంచాలు.. అధికారుల చుట్టూ ప్రదిక్షిణలతో పాత కష్టాలు మళ్లీ మొదలవుతాయి.
50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పోగొట్టాం. నేను రైతునే. వారి బాధలు నాకు తెలుసు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఆ కాలంలో ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదు. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యవసర పరిస్థితిని విధించింది. ఇందిరమ్మరాజ్యంలోనే కదా 400 మందిని కాల్చిచంపింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరి పడుతుంది.
కేటీఆర్
ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే జరుగుతున్నాయన్నది అవాస్తవం. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అస్త్రసన్యాసం చేశారు. కేసీఆర్ దీక్ష తో కేంద్రం దిగి వచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది. గోషామహల్.. కరీంనగర్.. కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థుల్ని పెట్టింది. రేవంత్ రెడ్డికి బీజేపీపై ప్రేమ ఉంది. రైతుబంధు కొత్త పథకం కాదు. కొన్నేళ్లుగా అది కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదు.
రాహుల్ గాంధీ ఉద్యోగం చేసిన వ్యక్తి కాదు. అసలు దరఖాస్తే చేయలేదు. రాహుల్ కు ఉద్యోగం అంటే ఏంటో తెలుసా? నేను పరీక్షలు రాశా.. ఇంటర్వ్యూలకు హాజరయ్యా.. ఉద్యోగం చేశా. కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాహుల్.. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా? దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి.
రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ బక్కోడు అయితే బుక్కెడు బువ్వ తినాలి కానీ లక్ష కోట్లు.. 10వేల ఎకరాలు దోచకూడదు కదా నారాయణ పేట గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా. 60 ఏళ్ల కల.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ రుణం తీర్చుకుంది. రాష్ట్రం వస్తే అభివృద్ధి జరుగుతుందని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కానీ అది తీరలేదు. ఒకప్పుడు రాజేందర్‌రెడ్డిని నన్ను లవకుశలు అనే వారు. కానీ ఇప్పుడు ఆయన నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచాడు.
అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించి ఉంటే ఎందుకు రైల్వేలైన్ మంజూరు కాలేదు? కొడంగల్ - నారాయణపేట పథకం పూర్తి కాలేదు ఎందుకు? ఇక్కడ సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతా అన్న నువ్వు, మీ సీఎం.. ఎందుకు నీరు ఇవ్వలేదు? మీ హయాంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం ఎందుకు ఏర్పాటు కాలేదు? రాష్ట్రంలో తొలి మున్సిపాలిటీగా ఉండి.. ఎందుకు అభివృద్ధి జరగలేదు. ఈ ఎమ్మెల్యే చవట దద్దమ్మ కాబట్టి ఈ ప్రాంతం వెనుకబడింది.