నేతలకు లేనిది.. అధినేతలకు మాత్రమే ఉండేదిదే!
విడి రోజుల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న నేతలు పలువురు తమ రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా విరుచుకుపడుతుంటారు.
By: Tupaki Desk | 26 April 2024 5:12 AM GMTనేతలకు.. అధినేతలకు మధ్య వ్యత్యాసం ఏంటి? కొందరు నేతలు కలిసి.. తమలో ఒకడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నా.. ఒక నాయకుడికి ఫాలోయర్లుగా ఉండిపోవటం తెలిసిందే. అలాంటి వ్యక్తి అధినేతగా మారతారు. నేతలకు లేనిది.. అధినేతలకు మాత్రమే ఉండే లక్షణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఇలాంటివి మిగిలిన సమయాల కంటే ఎన్నికలు జరుగుతున్న వేళ.. మరింత సులువుగా అర్థమవుతుందని చెప్పాలి.
విడి రోజుల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న నేతలు పలువురు తమ రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా విరుచుకుపడుతుంటారు. పదునైన విమర్శలతో ఉతికి ఆరేస్తుంటారు. అలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు సైతం.. సరిగ్గా ఎన్నికలు వచ్చేసినంతనే మాత్రం మార్పు కొట్టొచ్చినట్లుగా మారుతుంది. ఐదేళ్ల జగన్ ప్రభుత్వాన్నే తీసుకోండి. ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ను విమర్శలతో విరుచుకుపడే వారి జాబితా భారీగా ఉంటుంది. శాంపిల్ గా చెప్పాలంటే.. కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. ఆర్కే రోజా.. అంబటి రాంబాబు.. పేర్ని నాని.. గుడివాడ అమర్నాథ్.. అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత మంది నేతలు కనిపిస్తారు.
వారంతా డైలీ బేసిస్ లో తమ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబును కానీ.. పవన్ కల్యాణ్ ను కానీ విమర్శలతో విరుచుకుపడుతుంటారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం ముఖ్యమంత్రి జగన్ మీదా.. రాష్ట్ర మంత్రుల మీదా నిప్పులు చెరుగుతుంటారు. అలాంటి వారంతా సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం ఎక్కడా కనిపించరు. వారి ఫోకస్ మొత్తం తాము బరిలో ఉన్న నియోజకవర్గాల మీదనే ఉంటుంది. పార్టీకి దన్నుగా మాట్లాడే ఫైర్ బ్రాండ్ నేతలు సైతం ఎన్నికల వేళ.. మిగిలిన విషయాల్ని పట్టించుకోకుండా కేవలం తమ గెలుపు మీద మాత్రమే మాట్లాడుతుంటారు.
ఇదే నేతకు.. అధినేతకు మధ్యనున్న తేడాగా చెప్పాలి. విడిరోజుల్లో అన్ని విషయాల్ని మాట్లాడి.. ప్రభుత్వానికి.. పార్టీకి అండగా నిలిచినట్లుగా కనిపించే వారు ఎన్నికలు జరిగే రెండు నెలలు మాత్రం బుద్దిగా తమ నియోజకవర్గం మినహా మిగిలిన అంశాల్ని పట్టించుకోరు. అదే సమయంలో అధినేతలు విడి రోజుల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ మాత్రం వారు తమ నియోజకవర్గంపైన కంటే కూడా.. మిగిలిన నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అంశం మీద ఫోకస్ చేస్తుంటారు. అందుకోసం విపరీతంగా శ్రమిస్తుంటారు. ఇదంతా చూస్తే.. నేతకు.. అధినేతకు మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే అర్తమవుతుందని చెప్పాలి.