వారు... వీరు.... పాలిటిక్స్ బేజారు!
ఏపీలో ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో పార్టీలు మారుతున్న వారు.. పెరుగుతున్నారు.
By: Tupaki Desk | 20 Feb 2024 8:23 AM GMTఏపీలో ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో పార్టీలు మారుతున్న వారు.. పెరుగుతున్నారు. అధికార పార్టీ వైసీపీ నుంచి వెళ్లే వారే కాదు.. వచ్చే వారు కూడా కనిపిస్తున్నారు. తాజాగా నూజివీడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, సీనియర్ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరుతున్నారు. ఆయన ఇప్పటికే జగన్‌తో భేటీ అయ్యారు. ముద్దరబోయిన గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే.. ఆయన వైసీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బహదూర్ చేతిలో రెండు సార్లూ ఓడిపోయారు.
ఈ దఫా కొంచెం బాగానే తిరిగిన ముద్దరబోయినకుచివరి నిముషంలో జరిగిన మార్పుతో షాక్ తగిలింది. వైసీపీ నుంచిరేపో మాపో టీడీపీలోకి వస్తారని భావిస్తున్న కొలుసు పార్థసారథికి.. నూజివీడు నియోజకవర్గాన్ని చంద్రబాబు రిజర్వ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు సార్లు ముద్దరబోయినను ఉండవల్లికి పిలిచి మరీ చర్చించారు. బుజ్జగించారు. కానీ, తొలుత అంగీకరించిన ముద్దరబోయిన.. తర్వాత సైలెంట్‌గా మాజీ మంత్రి కొడాలి నాని గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలోవెనువెంటనే స్పందించిన సీఎం జగన్ ముద్దరబోయినకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే.. నూజివీడు ఎమ్మెల్యే మేకాను, ముద్దరబోయినను కూడా కలిసి రావాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో వారు తాడేపల్లికి చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మేకాకు టికెట్ విషయం ఇప్పుడు గందరగోళంలో పడింది. అయితే.. ముద్దరబోయినను మైలవరం పంపిస్తారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
దీంతో మైలవరం వైసీపీ సీటు ఖాళీగా ఉంది. ఇటీవల తిరుపతి యాదవ్‌కు ప్రకటించినా.. బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి ఆయనకు లేదు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముద్దరబోయినకు మైలవరం టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలా చూసుకున్నా.. మైలవరంలో టికెట్ ఇచ్చినా.. నూజివీడులో టికెట్ ఇచ్చినా.. వారు వీరు.. అవుతున్నారు. అంటే.. మైలవరంలో టీడీపీ తరఫున వసంత (ప్రస్తుతం వైసీపీ), నూజివీడులో కొలుసు(ప్రస్తుతంవైసీపీ) పోటీ చేస్తే.. వారిపై ముద్దర బోయిన పోటీ చేయనున్నారు. ఈయన ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ఇదీ.. సంగతి!