ఆ ఇద్దరు నేతలు ప్రధాని మోడీని తప్పుదారి పట్టిస్తున్నారా?
ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిది.. మరొకటి ఆయన రాజకీయ గురువు లక్ష్మణ్ ది అన్న విషయం తెలిసిందే. ఈ
By: Tupaki Desk | 27 Nov 2023 4:10 AM GMTకీలకమైన ఎన్నికల వేళ.. ఒక ప్రధాన పార్టీకి చెందిన అగ్రనేత సమయం చాలా విలువైనది. ప్రతి నిమిషం అమూల్యమైనదిగా చెబుతారు. ఇలాంటి వేళ.. పార్టీ గెలుపునకు అవకాశం ఉన్న చోట్లకు అగ్రనేతలు వెళ్లి.. అక్కడి ప్రజల్ని ఓట్లు వేయాలని అభ్యర్థిస్తే కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదు. ఓట్లు షిఫ్టు కావటానికి అవకాశం ఉంటుంది. అయితే.. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు (సోమవారం) తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలోని జిల్లాల్ని కాసేపు పక్కన పెడితే.. హైదరాబాద్ మహానగరంలో దాదాపు రెండు గంటల పాటు ఆయన రోడ్ల మీద రోడ్ షో చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా ఆయన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేస్తున్నారు. అందులో మొదటిది ముషీరాబాద్ అయితే.. రెండోది అంబర్ పేట.. మూడోది సనత్ నగర్. ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిది.. మరొకటి ఆయన రాజకీయ గురువు లక్ష్మణ్ ది అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతల అడ్డాకు ప్రధాని మోడీని తీసుకురావటం ఆసక్తికరంగా మారింది.
ఈ వ్యవహారం తెలంగాణ బీజేపీ అగ్రనేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోని23 నియోజకవర్గాల్లో ఏ మాత్రం గెలుపు అవకాశాలు లేని నియోజకవర్గాల్లో ఈ మూడు ఉన్నాయని చెబుతున్నారు. అంతో ఇంతో అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే సనత్ నగర్ లో కాస్తంత ఉందని చెప్పాలి. అది కూడా నూటికి 10-20 శాతమే.
అయితే.. గ్రేటర్ పరిధిలో పార్టీ మా జోరు మీద ఉన్న ఎల్ బీనగర్.. మహేశ్వరం.. రాజేంద్రనగర్ లో కానీ ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో చేస్తే మాత్రం ఫలితంమరోలా ఉండేదన్న మాట వినిపిస్తోంది. ఎల్ బీ నగర్ తో పోలిస్తే మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి జోరు మీద ఉన్నారని.. ఈసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఇబ్బందికి గురి అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో మోడీ చేత రోడ్ షో చేయించటానికి బదులుగా.. కేవలం తమ వ్యక్తగత ప్రతిష్ఠను పెంచుకోవటానికి వీలుగా కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ లు ఇద్దరు మోడీని వాడుకోవటం విస్మయానికి గురి చేస్తోంది.
ఈ ఇద్దరు నేతల వ్యక్తిగత స్వార్థం పుణ్యమా అని.. రేపొద్దున్న ఫలితాలు బిన్నంగా వచ్చిన తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సిన భారం మోడీ మీద పడుతుంది. ఆయన స్వయంగా వచ్చి రోడ్ షో చేసినా ప్రభావాన్ని చూపించలేకపోయారన్న విమర్శ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మాత్రం ఆలోచన ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఎందుకు చేయలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. మోడీని రోడ్ల మీదకు తీసుకొచ్చి ప్రచారం చేయించే విషయంలో కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ లు ఇద్దరు దిద్దుకోలేని తప్పు చేస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారి ప్రయోజనాలు మినహా పార్టీకి ఏ మాత్రం లాభం జరిగేలా మోడీ రోడ్ షో ఉండదన్న మాటలో నిజం ఎంతన్నది డిసెంబరు 3న తేలిపోనుంది.