Begin typing your search above and press return to search.

కౌంటింగ్ వేళ కీలక మైలు రాయి వద్ద ఉక్కు పోరాటం !

మొత్తానికి అయిదేళ్ళ ఉద్యమం ఫలితంగా 1971 ప్రాంతంలో విశాఖలో ఉక్కు కర్మాగారానికి శ్రీకారం చుట్టారు.

By:  Tupaki Desk   |   25 May 2024 4:00 PM GMT
కౌంటింగ్ వేళ కీలక మైలు రాయి వద్ద ఉక్కు పోరాటం !
X

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 1966లో భారీ ఉద్యమం విశాఖతో పాటు ఏపీ అంతా సాగింది. ఆనాడు ఏకంగా 32 మంది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అసువులు బాసారు. ఎందరో జైలు పాలు అయ్యారు. మొత్తానికి అయిదేళ్ళ ఉద్యమం ఫలితంగా 1971 ప్రాంతంలో విశాఖలో ఉక్కు కర్మాగారానికి శ్రీకారం చుట్టారు. 1980 ప్రాంతంలో అది నిర్మాణంతో ప్రగతి దిశగా సాగింది. 1992లో చూస్తే ఉత్పత్తిని ప్రారంభించింది.

ఈ మూడు కీలకమైన ఘట్టాలు జరిగినపుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. శ్రీమతి ఇందిరా గాంధీ విశాఖ 1971లో వచ్చి ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 1980లో కూడా ఆమె ప్రధానిగా ఉండగా ఉక్కు కర్మాగారం నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఇక పీవీ నరసింహారావు కేంద్రంలో ప్రధానిగా ఉండగా 1992లో విశాఖ వచ్చి మరీ అక్కడ జరిగిన ఒక భారీ కార్యక్రమంలో ఉక్కుని జాతికి అంకితం చేశారు.

అలా ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించి మూడున్నర దశాబ్దాలు అయింది. ఈ మధ్య్లో భారీ లాభాలను చూసింది. అలాగే నష్టాలను చూసింది. అయినా ఉక్కు కర్మాగారం ఎక్కడా తన దూకుడు ఆపలేదు. ఉక్కు కర్మాగారం నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడం. దేశంలోనే ఇది ఒక విషాదం. ఏ ఉక్కు కర్మాగారానికి లేని శాపం.

దాని వల్ల వచ్చే నష్టాలను ఉక్కుకు కలిపేసి ప్రైవేటు పరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు గతంలో జరిగాయి. కానీ అవి మధ్యలో ఆగాయి. మోడీ ప్రభుత్వం మాత్రం ఉక్కుని ప్రైవేట్ పరం చేయలని పట్టుదలగా ఉంది. 2021 ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ సెషన్ కి ముందు ఉక్కుని ప్రైవేటు పరం చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అది లగాయితూ ఉక్కులో ఉద్యమం రాజుకుంది.

అది ఏ రోజూ ఆగకుండా గత మూడున్నర దశాబ్దాలుగా విశాఖలో సాగుతోంది. అలా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1200 రోజులకు చేరుకోనున్నాయి. ఇది అతి కీలకమైన ఘట్టంగా ఉద్యమ నాయకులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలని పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకూ పోరు సాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే దీక్షలను విజయవంతం చేయాలని ఉక్కు కార్మిక వర్గాన్ని నేతలు పిలుపు ఇచ్చారు

ఒక వైపు కౌంటింగ్ జూన్ 4న జరగబోతోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కనుక మూడవసారి వస్తే ఉక్కుని ప్రైవేటీకరించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇవి కార్మిక లోకాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ధీటుగా కేంద్రం ప్రయత్నాలు ఎదుర్కొని ఉక్కుని బతికించాలని ఉద్యమ కారులు కోరుతున్నారు. ఉక్కు నగరం అన్న పేరుని విశాఖకు సార్ధకం అయ్యేలా చూడాలని అంటున్నారు.