టాలీవుడ్ వైపు నేతల చూపు.. ఎవరి కోసం?
గతం మరిచి.. ఇప్పుడు తమకు సహకరించాలంటూ.. పార్టీలు వేడుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ వైపు నాయకులు చూస్తున్నారు.
By: Tupaki Desk | 21 Nov 2023 2:45 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. అభివృద్ధి జరగాలంటే మరోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ ఎస్, తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి.. ఈ సారి తమకు అధికారం అప్పగించాలని కాంగ్రెస్.. ఈ రెండు కాదు.. అసలు మోడీ వల్లే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని.. బీజేపీ!! ఇలా.. మూడు పార్టీలూ మూడు రకాలుగా ప్రచారం చేస్తున్నా యి. మరోవైపు.. సెంటిమెంటును కూడా రాజేస్తున్నాయి. ఇక, ఈ క్రమంలోనే ప్రజాకర్ష ణ గల నాయకులను రంగంలోకి దింపుతున్నాయి.
గతం మరిచి.. ఇప్పుడు తమకు సహకరించాలంటూ.. పార్టీలు వేడుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ వైపు నాయకులు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రచారానికి తెరపడుతుండడం.. ఇదే కీలకమైన సమయం కావడంతో పార్టీలు తమకు సహకరించే హీరోలు, ఆర్టిస్టుల కాల్ షీట్ల కోసం వేచి ఉన్నాయి. అయితే.. వీరిలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో ఆయనను పక్కన పెట్టారు. మరి మెగా ఫ్యామిలీ మాటేంటన్నది ఇప్పుడు ప్రశ్న.
అదేసమయంలో ఘట్టమనేని మహేష్‌బాబు దన్ను ఎవరికి ఉంటుంది? అల్లు కుటుంబం ఎవరికి మద్ద తుగా నిలుస్తుంది? అనేది ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. అదేసమయంలో దగ్గుబాటి రానా, అక్కినేని, మంచు మోహన్‌బాబు కుటుంబాల విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుత హీరోల్లో ఎక్కువ మందికి మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వారంతా కేసీఆర్‌కే జై కొడతారా? అనేది ఒక చర్చ.
మరోవైపు.. కాంగ్రెస్ కూడా సినిమా రంగంలోని వారికి ఆహ్వానాలు పలుకుతోందని అంటున్నారు. దాసరి కుటుంబానికి చెందిన ఆయన కుమారుడిని పార్టీలోకి రావాలంటూ.. కొన్నాళ్ల కిందట ఆహ్వానించారు. కానీ, ఆయన రాలేదు. అయితే.. ప్రచారం కోసమైనా రావాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇక, కేసీఆర్‌తో తటస్థంగా ఉండేవారికి కూడా కాంగ్రెస్ ఆహ్వానాలు పంపుతోంది. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఇదిలావుంటే.. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా.. పరోక్షంగా సోషల్ మీడియా వేదికద్వారా అయినా.. ప్రచారం చేయాలనే ఒత్తిడి పెరుగుతుండడం గమనార్హం. మరి టాలీవుడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.