లియా.. మాయా.. ఇదిగో ‘టాటా’ల నవతరం సేవా సారథులు
దాని సమాధానమే.. లియా.. మాయా. సాధారణ ఉద్యోగులుగా సంస్థలో అడుగుపెట్టిన వీరు భవిష్యత్ లో చైర్ పర్సన్ లు కానున్నారు.
By: Tupaki Desk | 10 Nov 2024 7:08 AM GMTఅప్పటి జంషెడ్ జీ టాటా నుంచి.. మొన్నటి రతన్ టాటా వరకు.. టాటాలంటే భారత దేశ ప్రతిష్ఠ. ప్రతి ఒక్కరూ గౌరవించే కుటుంబం వారిది. భారత ఆర్థిక వ్యవస్థకు పునాదిలా.. సామాజిక రంగానికి స్తంభంలా.. వ్యాపార రంగానికి వారధిలా.. ఇలా దేశ నిర్మాణంలో టాటా గ్రూప్ ది విడదీయలేని పాత్ర. ముంబై కనీసం నగరంగా కూడా ఏర్పడక ముందే.. భయంకకరమైన ప్లేగ్ వ్యాధి కబళించిన రోజుల్లో.. ప్రజలందరూ వీడి వెళ్లిపోతున్న సమయంలో జంషెడ్ జీ టాటా తాజ్ హోటల్ నిర్మాణం చేపట్టి అందరూ మళ్లీ ముంబై వైపు చూసేలా చేశారు. అదీ దేశంపట్ల టాటాల నిబద్ధత. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ధ్రువతార రతన్ టాటా ఇటీవల లోకాన్ని వీడి వెళ్లింది. మరి ఆయన స్థానంలో టాటా కుటుంబం నుంచి వచ్చేదెవరు??? ఆ వ్యాపార సంస్థలను నడిపేదెవరు? టాటాల రక్తంలోని సేవకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ట్రస్టుల నిర్వహణను చూసేదెవరు..? దాని సమాధానమే.. లియా.. మాయా. సాధారణ ఉద్యోగులుగా సంస్థలో అడుగుపెట్టిన వీరు భవిష్యత్ లో చైర్ పర్సన్ లు కానున్నారు.
వచ్చేసింది నవ ‘తరం’..
టాటాల కుటుంబం అంటే అపార గౌరవం చూపించే భారతీయులు.. వారి వారసులు ఎవరా అని ఆసక్తిగా చూపడం సహజం. ఎందుకంటే.. టాటాల వ్యాపార సామ్రాజ్యం (టాటా సన్స్) విలువ రూ.12 లక్షల కోట్లు. ఇందులో రూ.8 లక్షల కోట్లు (66 శాతం) టాటా ట్రస్ట్ లదే. గ్రూప్ నుంచి వచ్చే డివిడెండ్లతో ఈ ట్రస్ట్ లు పనిచేస్తాయి. అంటే.. ట్రస్టులు నడవాలంటే వ్యాపార విభాగం లాభాలు తప్పనిసరి. అందుకే టాటాలు రెండింటి బాధ్యతలనూ తీసుకుంటారు. రతన్ టాటా తర్వాత నోయల్ టాటా.. టాటా ట్రస్ట్ లకు సారథి అయ్యారు.
బిజినెస్ జీనియస్ లియా..
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుంచి ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ నుంచి మార్కెటింగ్ లో ఎంబీఏ చదివారు లియా. 39 ఏళ్ల లియా.. తల్లిదండ్రులు నోయల్ టాటా, ఆలూ మిస్త్రీ. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన లియా 2006లోటాటా గ్రూప్ లోని ‘ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్’లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా చేరారు. తాజ్ బ్రాండ్ సహా వివిధ హోటళ్లు, రిసార్టులు, ప్యాలెస్ ల నిర్వహణ ఈ సంస్థదే. ఇప్పుడు లియా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. హోటల్స్ అభివృద్ధి, విస్తరణను పర్యవేక్షిస్తున్నారు. అంటే.. టాటా గ్రూప్ నకు అత్యంత పేరుతెచ్చిన తాజ్ గ్రూప్ ను విదేశాలకు విస్తరించడం, బ్రాండ్ ను అత్యున్నత ప్రమాణాలు అందుకునేలా తీర్చిదిద్దడంలో లియాది కీలకపాత్ర. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘లూయీ విటాన్’ లో ఇంటర్న్ షిప్ చేశారు లియా. ఇందుకోసం 2010లో మూడు నెలలు విరామం తీసుకున్న ఆమె.. మిగతా తన కెరియర్ ను లో టాటా గ్రూప్ నకే అంకితం చేశారు.
టాటా డిజిటల్ ఫేస్ మాయ..
నోయల్ దంపతుల చిన్న కూతురే మాయ. అంటే.. లియా చెల్లెలు. 36 ఏళ్ల మాయ ఇంగ్లండ్ లోని బేయ్స్ బిజినెస్ స్కూల్, వార్విక్ యూనివర్సిటీల్లో చదివారు. ‘టాటా క్యాపిటల్’ లో అనలిస్ట్ గా ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. టాటా ఆపర్చ్యూనిటీస్ ఫండ్ లో పోర్ట్ ఫోలియో మేనేజర్, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజెంటేటివ్ గా బాధ్యతలు చేపట్టారు. డిజిటల్ విభాగానికి వచ్చాక.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ ను డిజిటల్ వేదికలపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. గ్రూప్ లోని అన్ని సంస్థల ఉత్పత్తులూ, సేవలూ లభించే ‘టాటా న్యూ’ సూపర్ యాప్ వెనుక ఉన్నది మాయానే.
పెద్దనాన్న బాటలో..
లియా, మాయాలకు పెదనాన్న అవుతారు రతన్ టాటా. ఆయన వీరికి వ్యాపార మార్గదర్శి. 2022లో వీరి తమ్ముడు నెవల్ కు ‘టాటా మెడికల్ సెంటర్ బోర్డ్’ లో ట్రస్టీలుగా స్థానం కల్పించారు రతన్. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో ఓ క్యాన్సర్ హాస్పిటల్ నడుస్తోంది. మే నుంచి లియా... టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, సర్వజనిక్ ట్రస్ట్, మాయా.. ఆర్డీ టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, సర్వజనిక్ ట్రస్ట్ ట్రస్టీలుగా బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే గ్రూపు విభాగాల పగ్గాలు పొందొచ్చు. భవిష్యత్తులో టాటా సన్స్ చైర్ పర్సన్ లు కూడా వీరే కావొచ్చు.