Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో ఆ పాడు పని.. రూ.1.24 కోట్ల జరిమానా!

అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   4 Oct 2023 12:30 PM GMT
అంతరిక్షంలో ఆ పాడు పని.. రూ.1.24 కోట్ల జరిమానా!
X

అంతరిక్షంలోకి వివిధ దేశాలు పంపే ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, శాటిలైట్స్‌ కారణంగా అంతరిక్షం కూడా ఒక గార్బేజ్‌ గా మారుతోంది. భారీ ఎత్తున చెత్త పేరుకుపోతోంది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్‌ నెట్‌ వర్క్‌ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(ఎఫ్‌సీసీ) 1,50,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.1.24 కోట్లు) జరిమానా విధించించడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. డిష్‌ నెట్‌ వర్క్‌ కంపెనీ 2002లో ఎకోస్టార్‌–7 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరుకున్న ఈ ఉపగ్రహం కాలపరిమితి 2022లో ముగిసిపోయింది.

దీంతో నిరుపయోగంగా మారిన ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి 299 కిలోమీటర్ల దూరం పంపించాల్సి ఉంది. అయితే 122 కిలోమీటర్లు వెళ్లాక ఇంధనం నిండుకోవడంతో అక్కడే ఉపగ్రహం నిలిచిపోయింది. ప్రస్తుతం ఇది భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది. అంతేకాకుండా తర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా నిలిచింది.

అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలను చెత్తగానే పరిగణిస్తారు. 1957 నుంచి ఇప్పటిదాకా 10 వేలకుపైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించారు. వీటిలో సగం శాటిలైట్లు పనిచేయడం లేదు. ఇవన్నీ అక్కడ చెత్తలాగా పేరుకుపోయాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌.. తన అంతరిక్ష వ్యర్థాల నిరోధక నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీకి మొదటి జరిమానా విధించినట్లు కమిషన్‌ ప్రకటించింది. 'ఉపగ్రహ కార్యకలాపాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వేగవంతమవుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు తమ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఎఫ్‌సీసీ వెల్లడించింది.

అంతరిక్ష శిధిలాలు, ఫంక్షనల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ కానటువంటి కృత్రిమ వస్తువులు భూమి చుట్టూ తిరుగుతున్నాయని ఎఫ్‌సీసీ తెలిపింది. కక్ష్యలో ఎక్కువ కాలం ఇలా చెత్త పేరుకుపోతే కొత్తగా వచ్చే శాటిలైట్‌ ల రాకకు, వాటి కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతోంది. ఈ నేపథ్యంలో 2022లో నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉపగ్రహ ఆపరేటర్లు తమ ఉపగ్రహాలను మిషన్‌ పూర్తయిన ఐదు సంవత్సరాలలోపు పారవేయవలసి ఉంటుంది.