విద్యార్థినులకు మద్యం తాగించి... టూర్ లో లెక్చరర్ల తప్పుడు పని!
అవును... విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
By: Tupaki Desk | 19 Oct 2024 5:00 AM GMTవిద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు తప్పుడు పనులకు పూనుకున్నారు.. ఇంట్లో తల్లితండ్రులు ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటారో, ఆ విధంగా విద్యార్థినులను చూసుకోవాల్సిన లెక్చరర్లు చిల్లర వ్యవహారాలు చేశారు.. వారి వంకర బుద్ధిని బయటపెట్టుకున్నారు.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం అధ్యాపక వృత్తికే మచ్చగా ఉందని అంటున్నారు.
అవును... విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని నమ్మి, ఎదిగిన ఆడపిల్లలను విహారయాత్రకు పంపిన తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ముచేశారు. తమను ఎంతో నమ్మి వచ్చిన విద్యార్థినులపై తప్పుడుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. కేసు నమోదైంది!
వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని కనకపురలో గల ఓ కళాశాల అధ్యాపకులు.. విద్యార్థులను అక్టోబరు 5వ తేదీ నుంచి 10వరకూ మడికేరి విహారయాత్రకు తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో అక్టోబరు తొమ్మిదో తేదీ రాత్రి ముగ్గురు విద్యార్థినులను తమ గదిలోకి పిలిపించుకుని వారితో మద్యం తాగమని ముగ్గురు లెక్చరర్లు ఒత్తిడి చేశారట.
అలా బలవంతంగా వారితో మద్యం తాగించి.. అనంతరం డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారని చెబుతున్నారు. ఈ సమయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు వాపోతున్నారు. ఈ క్రమంలో మేల్కొన్న తర్వాత.. సమస్యను కుటుంబ సభ్యులకు వివరించారట బాధిత విద్యార్థినులు.
లెక్చరర్లు తమతో అలా ప్రవర్తిస్తున్న సమయంలో అటెండర్ వచ్చి వారించినా.. తప్పని చెప్పినా.. అతడిని దుర్భాషలాడుతూ లెక్చరర్లు బయటకు గెంటేశారని చెబుతున్నారు. ఈ సమయంలో తమను రక్షించడానికి మహిళా లెక్చరర్లు రాలేదనేది బాధిత విద్యార్థినుల ఫిర్యాదుగా ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. తమ తల్లితండ్రులతో కలిసి బాధిత విద్యార్థినులు ముగ్గురు లెక్చరర్స్ పై కనపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో ఆ ముగ్గురు లెక్చరర్స్ పై చర్యలు తీసుకోవాలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్ కళాశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీచేసింది.