లీలావతి ఆస్పత్రిలో వివాదమేంటి? ఎందుకు చిక్కుల్లో పడింది?
ముంబై నగరంలోని లీలావతి హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ప్రముఖులకు వైద్యం అందించిన ఈ ఆసుపత్రి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 16 March 2025 8:00 PM ISTముంబై నగరంలోని లీలావతి హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ప్రముఖులకు వైద్యం అందించిన ఈ ఆసుపత్రి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడినప్పుడు కూడా ఇక్కడే చికిత్స పొందారు. అయితే ఇప్పుడు ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనికి కారణం, ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌లో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు.
లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్‌కేఎంఎంటీ) తమ సంస్థకు చెందిన మాజీ సభ్యులు, సంబంధిత వ్యక్తులు దాదాపు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని తాజాగా ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఎల్‌కేఎంఎంటీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా బాంద్రా పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదులు దాఖలు చేశాయి.
ప్రముఖ వజ్రాల వ్యాపారి కీర్తిలాల్ మెహతా తన భార్య లీలావతి మెహతా జ్ఞాపకార్థం ఈ ఆసుపత్రిని స్థాపించారు. ఇందుకోసం ఆయన లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. 1997లో ఈ ఆసుపత్రికి పునాదిరాయి వేశారు. ముంబైలో అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రి ఏర్పాటయింది. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్య సిబ్బంది ఉన్నారు.
2002లో కీర్తిలాల్ మెహతా అనారోగ్యానికి గురవడంతో, ఆయన సోదరుడు విజయ్ మెహతా ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించారు. 2006లో విజయ్ మెహతా తన కుమారుడు, మేనల్లుళ్లను అక్రమంగా ట్రస్టీలుగా నియమించారని, అలాగే అప్పటి శాశ్వత ట్రస్టీ కిషోర్ మెహతాను పదవి నుంచి తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2016లో కిషోర్ మెహతా తిరిగి ట్రస్టీగా నియమితులయ్యారు. ఎనిమిది సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు.
2024లో కిషోర్ మెహతా మరణించిన తరువాత, ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఆసుపత్రి ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించారు. ఈ ఆడిట్‌లో అనేక అక్రమాలు బయటపడటంతో ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
-లీలావతి ఆస్పత్రి ప్రస్థానం
1997లో ఈ ట్రస్ట్ 314 పడకలు, 12 ఆపరేషన్ థియేటర్లు, 300 మంది కన్సల్టెంట్లు మరియు 1,800 మంది సిబ్బందితో లీలావతి హాస్పిటల్‌ను ప్రారంభించింది. ఇది ప్రతిరోజు 300 మంది ఇన్-పేషెంట్లకు , 1,500 మంది అవుట్-పేషెంట్లకు సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటైంది. లీలావతి హాస్పిటల్ , రీసెర్చ్ సెంటర్‌ను పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అయిన లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ట్రస్ట్ భారతదేశంలో అనేక ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రి పూర్తిగా స్వయం నిధులతో నడుస్తోంది. మెనాబెన్ అనే మహిళ ఇచ్చిన ₹1000 విరాళంతో ప్రారంభమైన ఈ ప్రస్థానం, కీర్తిలాల్ మణిలాల్ మెహతా ట్రస్ట్ , లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌గా ఎదిగింది. కీర్తిలాల్ మెహతా కుమారుడు కిషోర్ మెహతా..ఇతర కుటుంబ సభ్యులు ఈ ట్రస్ట్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు.