ఫొటోకు పిలిచి కుర్చీవేయలేదు.. మండలిలో ఫొటో సెషన్ రచ్చ
మంగళవారం నిర్వహించిన ఫొటో సెషన్ పై వైసీపీ నేత బొత్స సత్యానారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసన మండలిని, మండలి సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 19 March 2025 5:44 PM ISTశాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు మంగళవారం నిర్వహించిన ఫొటో సెషన్ రచ్చకు దారితీసింది. ప్రతిపక్షానికి చెందిన శాసనమండలి సభ్యులను ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని, దానికి నిన్న జరిగిన ఫొటో సెషన్ సాక్ష్యమంటూ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తనతోపాటు మండలి చైర్మన్ కొయ్యి మోషేన్ రాజుకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే ప్రతిపక్షం విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. మండలి చైర్మన్ రాక కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎండలో పది నిమిషాల పాటు వేచిచూశారని గుర్తు చేసింది.
మంగళవారం నిర్వహించిన ఫొటో సెషన్ పై వైసీపీ నేత బొత్స సత్యానారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసన మండలిని, మండలి సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ మీట్ వద్ద కూడా మండలి చైర్మన్ ఫొటోలు లేవన్న విషయాన్ని లేవనెత్తారు. చైర్మన్ ను వ్యక్తిగతంగా కించపరుస్తూ, అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫొటో సెషన్ లో తనకు కుర్చీ వేయలేదని బొత్స ఆరోపించారు. ప్రొటోకాల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సభ దృష్టికి తెచ్చారు. దీనివల్ల సభను, సభ్యులను అగౌరవపరిచినట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే బొత్స ఆరోపణలు, విమర్శలపై స్పందించిన శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్, బొత్స ఆరోపణలు సరికాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం అత్యున్నత స్థాయిలో ఉన్న చైర్మన్ పట్ల ప్రభుత్వానికి చిన్నచూపులేదని స్పష్టం చేశారు. మండలి చైర్మన్ పై సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, సభ్యులకు తేలిక భావన లేదన్నారు. మండలి చైర్మన్ రాకకోసం సీఎం, డిప్యూటీ సీఎం మండుటెండలో వేచిచూశారన్నారు. సభ పట్ల, చైర్మన్ పట్ల ఇచ్చే గౌరవానికి అదే నిదర్శనమన్నారు. సంప్రదాయాలను పాటించాలని సీఎం చంద్రబాబు తమకు దిశానిర్దేశం చేశారన్నారు. ఇక ప్రొటోకాల్ పరంగా ఏమైనా పొరపాట్లు జరిగాయోమో తెలుసుకోడానికి విచారణ చేస్తామని తెలిపారు. సభను, సభ్యులను నిర్లక్ష్యం చేశామనే ఆరోపణలు సరికాదని మంత్రి స్పష్టం చేశారు.