Begin typing your search above and press return to search.

మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర్లో చిరుతపులి?

మెట్రో స్టేషన్ కు సమీపంలోని నడిగడ్డ.. సుభాష్ చంద్రబోస్ నగర్ తండాలతో పాటు పలు నిర్మాణ సంస్థలకు చెందిన క్యాంపులు ఉండటంతో.. వారందరిని అలెర్టు చేశారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 5:00 AM GMT
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర్లో చిరుతపులి?
X

అత్యంత రద్దీగా ఉండే మియాపూర్ మెట్రో స్టేషన్ కు సమీపంలో చిరుతపులి ఒకటి సంచరించిందన్న సమాచారం శుక్రవారం రాత్రి సంచలనంగా మారింది. మియాపూర్ మెట్రో స్టేషన్ కు ఒకవైపుమొత్తం ఖాళీగా భూములుపెద్ద ఎత్తున ఉండటం.. కొందరు కూలీలు.. కార్మికులు తాత్కాలిక టెంట్లు వేసుకొని నివసిస్తూ ఉంటారు. ఒక నిర్మాణ సంస్థకు చెందిన కూలీల్లో ఒకరు తాను చిరుతపులిని చూసినట్లుగా సమాచారం ఇవ్వటం.. దాని వీడియో తీయటంతో వైరల్ గా మారింది. దీంతో.. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీడియో తీసినట్లుగా చెబుతున్న కూలీలను మియాపూర్ పోలీసులు విచారించారు. తాము చిరుతపులిని చూశామని సీఐ క్రాంతికుమార్ కు చెప్పటంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మెట్రో స్టేషన్ కు సమీపంలోని నడిగడ్డ.. సుభాష్ చంద్రబోస్ నగర్ తండాలతో పాటు పలు నిర్మాణ సంస్థలకు చెందిన క్యాంపులు ఉండటంతో.. వారందరిని అలెర్టు చేశారు. నిర్మాణ సంస్థల యాజమాన్యాల్ని అలెర్టు చేశారు.

అదే సమయంలో చిరుతను చూసినట్లుగా చెబుతున్నప్పటికీ.. దాని జాడ లేకపోవటంతో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో చిరుతపులి పాదముద్రల్ని అటవీ శాఖ అధికారులు గుర్తిస్తే తప్పించి.. మరిన్ని వివరాలు తెలిసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఒకరు తాము చిరుతపులిని చూసినట్లుగా చెప్పటమే తప్పించి.. మరే వివరాలు లేకపోవటంతో అయోమయంగా మారింది.

చిరుత సంచారం నేపథ్యంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. శనివారం ఉదయానికి నాటికి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. కూలీలకు కనిపించింది చిరుతపులి కాదని అడవి పిల్లిగా తేల్చారు. దీంతో.. చుట్టుపక్కల వారంతా ఊపిరిపీల్చుకున్నారు.