Begin typing your search above and press return to search.

ఎంపీ క్యాండిడేట్స్... ఇద్దరికీ కొరత...!

ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే అంటే పోటీకి చాలా మంది రెడీగా ఉంటున్నారు. అదే ఎంపీ అనేసరికి మాత్రం పక్కకు పోతున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2024 4:38 PM GMT
ఎంపీ క్యాండిడేట్స్... ఇద్దరికీ కొరత...!
X

ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే అంటే పోటీకి చాలా మంది రెడీగా ఉంటున్నారు. అదే ఎంపీ అనేసరికి మాత్రం పక్కకు పోతున్నారు. ఎంపీ అభ్యర్థుల కొరత దీంతో పెద్ద ఎత్తున ఉంది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఎంపీ పదవి కంటే గొప్పది లేదు. ఎమ్మెల్యేగా చేయమంటే గతంలో ఎంపీగా చేసిన వారు నో చెప్పేవారు. ఒక విధంగా డిమోషన్ కింద భావించేవారు.

కానీ ఇపుడు ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే ఎమ్మెల్యేలని ఎంపీలుగా పంపుతామంటే మాకు వద్దు బాబూ అని ఒక దండం పెడుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే గతంలో మాదిరిగా ఎంపీలకు ఎటువంటి అధికారాలు లేవు అని ప్రచారంలో ఉండడమే.

కేంద్రంలో గత పదేళ్ల మోడీ పాలన తీసుకుంటే ఎంపీలకు పెద్దగా పవర్స్ లేవు అని అంటున్నారు. వారు ఎలాంటి ఇతరత్రా ప్రయోజనాలు పొందనీయకుండా కట్టడి చేశారు అని అంటున్నారు. దానికి తోడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెట్టే ఖర్చులు ఎంతో వ్యయ ప్రయాసాలకు పడినా కూడా చివరికి లోకల్ గా పవర్ ఉండడం లేదు, ఢిల్లీలో కూడా ఎవరూ పట్టించుకునే వారు లేరు అని అంటున్నారు.

దాంతోనే ఎంపీ కంటే ఎమ్మెల్యే మేలు కడుపులో చల్ల కదలకుండా హాయిగా లోకల్ గా పనిచేసుకోవచ్చు అని భావిస్తున్నారు. ఇక లక్ కానీ నక్కను తొక్కితే మంత్రి కూడా కావచ్చు. తన సొంత జిల్లాలో చక్రం తిప్పవచ్చు అన్నది కూడా ఉంది. ఈ కారణాల వల్లనే ఎంపీ అంటే అనాసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు.

దీంతో ఏపీలో అధికార వైసీపీకి ప్రతిపక్ష టీడీపీకి కూడా బూతద్ధంలో పెట్టి వెతికినా కూడా ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు అని టాక్ నడుస్తోంది. ఎంపీ అంటే ఏడు అసెంబ్లీ సీట్లను కవర్ చేసి ఉండాలి. అర్ధబలం అంగబలం రెండూ గట్టిగా ఉండాలి. దాంతో అలాంటి వారి కోసం అన్వేషణ వీర లెవెల్ లో చేస్తున్నారు.

అయినా సరే సరైన అభ్యర్ధులు మాత్రం దొరకడం లేదు అని అంటున్నారు. ఇక ఎంపీగా పోటీ అంటే అది కాస్ట్ లీ వ్యవహారం అయిపోయింది అని అంటున్నారు. దాంతో ఎవరూ ముందుకు రావడం లేదు అని తెలుస్తోంది. ఇక వైసీపీ అధికారంలో ఉంది. అయినా సరే ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనుకున్నా ఎవరూ ఓకే అనని సీన్ ఉందంటే ఆలోచించాల్సిందే.

దీంతో ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లలో చాలా వరకూ అభ్యర్థులను చూసుకుంటున్నా కొన్ని కీలక స్థానాలలో మాత్రం ఎవరూ ఫైనల్ కాని సీన్ ఉందిట. కర్నూల్ ఎంపీ సీటుకు అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు. ఇది పక్కాగా వైసీపీ గెలిచే సీటు. అయినా సరే అభ్యర్ధులు ఎవరో తేలకపోవడం చిత్రమే అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే మంత్రి గుమ్మలూరి జయరాం కి ముందు ఈ సీటుని ప్రకటించారు. కానీ ఆయన వద్దు అనేసి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇక టీడీపీలో చూస్తే వెతుకులాట తప్ప అభ్యర్థి ఎవరూ అన్నది నిర్ధారణ కావడం లేదు. ఇలా రెండు పార్టీలకు చాలా చోట్ల ఎంపీ అభ్యర్ధులు లోటు అయితే గట్టిగా కనిపిస్తోంది అని అంటున్నారు.

దాంతో కొన్ని చోట్ల కీలక నేతల బంధువులు, మిత్రులకు ఎంపీ సీటుని కట్టబెడుతున్న ఉదంతాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మరీ జూనియర్లకు కూడా ఈసారి పోటీ చేయిస్తున్నారు. ఇక సిట్టింగులను మార్చుతారని అనుకున్నా వీలు కాక రెండవ సారి వారికే చాన్స్ ఇస్తున్నవి కూడా కొన్ని చోట్ల ఉన్నాయంటే ఎంతలా ఎంపీ సీట్లకు కొరత ఉందో అర్ధం చేసుకోవాల్సిందే మరి.