Begin typing your search above and press return to search.

బీజేపీకి మరీ ఇంత తక్కువనా... బాబు వ్యూహానికి బ్రేక్...!?

ఇపుడు వస్తున్న సమాచారం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీకి నాలుగంటే నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే చంద్రబాబు ఇవ్వడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:18 AM GMT
బీజేపీకి మరీ ఇంత తక్కువనా... బాబు వ్యూహానికి బ్రేక్...!?
X

పొత్తులలో పీహెచ్ డీ చేసిన మాస్టర్ బ్రెయిన్ టీడీపీ అధినేత చంద్రబాబుది. ఆయన తానుగా చెప్పుకున్నట్లుగా తొమ్మిది ఎన్నికలను చూశారు. ఎన్నో పార్టీలను వాటి అధినేతలను చూసారు. పొత్తులు ఎన్నో పార్టీలతో పెట్టుకున్నారు. సక్సెస్ రేట్ మాత్రం టీడీపీదే అయింది. పొత్తు పార్టీల ఫ్యూచర్ మాత్రం అలాగే ఉంది.

ఇలా పొత్తులలో కొత్త ఎత్తులు వేస్తూ అంతా తనకు అనుకూలం చేసుకోవడంలో చంద్రబాబు ఎపుడూ గ్రేట్ అనే అంటారు. జనసేనకు కచ్చితంగా నలభైకి తగ్గకుండా సీట్లు వస్తాయని భావించిన వారికి ఝలక్ ఇచ్చేలా 24 సీట్లను మాత్రమే ఇచ్చి సరిపుచ్చారు. అలాగే మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు.

ఇక సరి అన్నట్లుగానే ఆ పార్టీని ఉంచేశారు. ఈ నంబర్ చూసిన బీజేపీ పెద్దలు జడుసుకున్నారు అని అంటున్నారు. ఏపీలో సోలోగా పోటీ చేసినా పొత్తులతో దిగినా మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లు టీడీపీయే సొంతంగా గెలవాలి అన్నది బాబు ఆలోచన. పొత్తు పార్టీలు తోక జాడించకుండా ఉందేందుకే ఆయన ఈ విధంగా వ్యూహరచన చేశారు అని అంటున్నారు.

ఒకసారి సొంతంగా అధికారంలోకి వచ్చాక పొత్తు పార్టీలను అప్పటి పరిస్థితుల బట్టి దగ్గరకు తీయవచ్చు లేదా అలాగే ఉంచవచ్చు. మొత్తం ప్రభుత్వం దాని వ్యవహారాలూ టీడీపీ కంట్రోల్ లోనే పూర్తిగా ఉండాలన్నదే బాబు విధానం అని అంటున్నారు.

అందుకే ఆయన మిత్ర పక్షాలను పాతిక ముప్పయి సీట్లకే పరిమితం చేస్తూ టీడీపీ 145 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని స్కెచ్ గీసారు అని అంటున్నారు. అందులో ఆయన జనసేన విషయంలో సక్సెస్ అయ్యారు. ఇక మిగిలింది బీజేపీ. జనసేనను చూపించే బీజేపీని దారికి తేవాలన్నది టీడీపీ హై కమాండ్ ఆలోచన అని ముందుగా రిలీజ్ చేసిన తొలి జాబితాను బట్టి అర్ధం అవుతోంది.

ఏపీలో జనసేన బలంగా ఉంది. సినీ గ్లామర్ ఉన్న పవన్ ఉన్నారు. మరో బలమైన సామాజిక వర్గం అండ ఉంది. ఎన్ని ఉన్నా కూడా జనసేనకు 24 సీట్లు ఇచ్చారూ అంటే బీజేపీకి ఎన్ని ఇస్తారు అన్నది వారే అంచనా వేసుకునే విధంగా బాబు తొలి విడత జాబితాతో చూపించారు అని అంటున్నారు.

ఇపుడు వస్తున్న సమాచారం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీకి నాలుగంటే నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే చంద్రబాబు ఇవ్వడానికి చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఎంపీ సీట్లు తీసుకుంటే జనసేన కంటే ఒకటి ఎక్కువగా నాలుగు ఇస్తారని సాగుతోంది. ఈ నంబర్ గురించి తెలుసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం విస్మయం వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు.

ఇక 2014లో బీజేపీకి 15 సీట్లు ఆరు ఎంపీ ఇస్తామని చెప్పి చివరికి 12 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు టీడీపీ ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఇచ్చిన వాటిలో కూడా టీడీపీ రెబెల్స్ ని దింపి చాలా చోట్ల బీజేపీ అవకాశాలను దెబ్బతీశారు అని అంటున్నారు. దాంతోనే బీజేపీ గతానుభవాలను చూసుకుని జాగ్రత్త పడుతోందిట.

బీజేపీ ఈసారి తమకు పాతిక దాకా అసెంబ్లీ పది దాకా ఎంపీ సీట్లు కోరుతోంది అని ప్రచారం లో ఉన్న మాట. అలాగే జనసేనకు కనీసంగా నలభై అసెంబ్లీ అయిదు దాకా ఎంపీ సీట్లు ఇస్తారని ఆలోచించిందట. జనసేనకు ఇంత తక్కువగా సీట్లు ఇవ్వడంతో బీజేపీ పెద్దలలో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.

కేంద్రంలో ఉన్న తన ప్రభుత్వం పలుకుబడిని ఎన్నికల్లో వాడుకోవడానికే కొన్ని సీట్లను పొత్తు పేరుతో విదిలిస్తూ టీడీపీ రాజకీయ వ్యూహాలకు తెర తీసిందని కమలనాధులు భావిస్తున్నారుట. దాంతో పొత్తూ లేదు ఏమి లేదు సోలోగా పోటీ దిగిపోదామన్నది ఆ పార్టీలో చర్చగా ఉంది.

అదే సమయంలో తమతో పొత్తులో ఉన్న జనసేనను కూడా కలుపుకోవడానికి చూస్తున్నారుట. ఇప్పటికే సీట్ల దగ్గర పేచీతో జనసేన నేతలు మండుతున్నారు. పవన్ కూడా వారికి సర్ది చెప్పలేని పరిస్థితి. మరి టీడీపీతో కలసి జనసేన వెళుతుందా లేక బీజేపీ జనసేన కలసి పోటీ చేస్తాయా అన్న చర్చ కూడా ఈ దశలో సాగడం విశేషం. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.