ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం.. టీ ఓటరు నాడి మారుతోందా..!
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఒక్క ఛాన్స్ వాదనను మరింతలోతుగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
By: Tupaki Desk | 2 Nov 2023 8:45 AM GMTఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మీకోసం కాంగ్రెస్ అనేక త్యాగాలు చేసింది. తెలంగాణ ఇచ్చింది.. అంటూ.. కాంగ్రెస్ అగ్రనాయకులు సైతం తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను చైతన్య పరిచేందుకు చేస్తున్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. విజయ భేరి యాత్రల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నా షెడ్యూల్ ప్రకారం హాజరవుతున్నారు. వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఈ యాత్రలు చేపట్టారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఒక్క ఛాన్స్ వాదనను మరింతలోతుగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని పదే పదే నాయకులు కూడా చెబుతున్నా రు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకులు.. ప్రజలను మోటివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రు. ఈ క్రమంలో తెలంగాణ ఓటరు నాడి కూడా మారుతున్నట్టు తెలుస్తోంది.
గత రెండు ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఆదరించారు. అయితే.. తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్‌కు మాత్రం పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అయినా.. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలనే మాట ఓ వర్గం ప్రజల్లో జోరుగా వినిపిస్తోంది. ``ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం`` అనేమాట ఇప్పుడు తెలంగాణ ఓటరు నుంచి వినిపిస్తోంది. కొన్ని ఆన్‌లైన్ చానెళ్లు.. పత్రికలు అంతర్గతం గా చేస్తున్న సర్వేల్లోనూ ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాదన బలంగా ప్రజల్లోకి చేరేలా.. కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఏన్నికల కోసం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు ఒక్క ఛాన్స్‌ను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో కరపత్రాల పంపిణీతోపాటు నాయకులు కూడా ఒక్క ఛాన్స్‌పై ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేస్తోంది. తెలంగాణ ఓటరు నాడి ఇప్పుడిప్పుడే మారుతున్ననేపథ్యంలో వారిని మరింత మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.