Begin typing your search above and press return to search.

ఏపీ - నేషనల్... ఎగ్జిట్ పోల్స్ లో ఇంత తేడా ఎందుకు?

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2024 2:30 PM GMT
ఏపీ - నేషనల్...  ఎగ్జిట్  పోల్స్  లో ఇంత తేడా ఎందుకు?
X

ఏపీలో జూన్ 4న జరగాల్సిన సందడంతా దాదాపుగా జూన్ 1న జరిగిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఇదే క్రమంలో... జూన్ 4న ఏపీలో రాజకీయ వాతావరణం ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి జూన్ 1న జరిగిన సందడి జస్ట్ ట్రైలర్ అని చెప్పినా తప్పులేదేమో అన్నట్లుగా సాగింది ఏపీలోని సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదల కార్యక్రమం!

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు సరికదా.. మరింత టెన్షన్ పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణం ఉందనే చెప్పాలి. అందుకు అసలైన కారణం... పలు సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.

వాస్తవానికి ఎన్నికల ముందు చేసే ప్రీపోల్ సర్వేలు వేరు.. పోలింగ్ ముగిసాక చేసే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వేరు. కారణం... ప్రీ పోల్ సర్వే ఫలితాలు మారే అవకాశం కచ్చితంగా ఉండొచ్చు కానీ... ఒక సారి ఓటు వేసేసిన తర్వాత ఆ ఫలితాలు మారే అవకాశం లేదు. అందుకే ఒక నెంబర్ అటు ఇటు అయినా.. ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో దాదాపు అన్ని సర్వే సంస్థలూ ఒకే తరహా ఫలితాలు ఇస్తాయని అంటుంటారు.

అయితే... ఏపీలో మాత్రం లెక్క పూర్తిగా మారిపోయింది. ఏపీలో ప్రీపోల్ సర్వేలను మించిన తారతమ్యాలు ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో వెలువడటం గమనార్హం. ఏపీలో కొన్ని సంస్థలు వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని చెబితే... ఇంకొన్ని సంస్థలు మాత్రం కూటమిదే విజయం అని చెప్పాయి. దీంతో... ఎవరిని నచ్చిన ఫలితాలను ఆయా పార్టీలు, వాటి అనుంగ మీడియా సంస్థలూ ప్రకటించుకున్న దయణీయ పరిస్థితి!

దీంతో... అసలు ఇవి ఎగ్జిట్ పోల్ ఫలితాలా.. లేక, ఆయా సంస్థలు వారి వారి కోరికలను ఈ ఫలితాల రూపంలో బయటపెట్టాయా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే ఇది కేవలం ఏపీ ఫలితాల విషయంలో మాత్రమే జరగడం గమనార్హం. జాతీయ స్థాయిలోని సర్వే / మీడియా సంస్థలు మాత్రం ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి!

ఇందులో భాగంగా... ఏపీతో పాటు జాతీయ స్థాయిలోనూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఎగ్జాట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో సుమారుగా అన్ని సంస్థలూ ఒకేలా అంచనాలు వెల్లడించాయి. పది సీట్లు అటు ఇటు అయినప్పటికీ.. దాదాపుగా ప్రతీ సంస్థా కేంద్రంలో ఎన్డీయే కూటమికి 300 పైచిలుకు సీట్లతో మరోసారి అధికారంలోకి రావడం కన్ఫాం అని తెలిపాయి!

దీంతో ఇవి కరెక్ట్ ఎగ్జిట్ పోల్స్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఏ సంస్థ చేసినా ఎగ్జిట్ పోల్స్ విషయానికొచ్చే సరికి కాస్త అటు ఇటుగా అయినా ఫలితాలు దాదాపు ఒకేలా ఉండాలని అంటారు.. ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో సంస్థలు నిరూపించాయని చెబుతున్నరు. అయితే ఏపీలో మాత్రం ఆ అవకాశం లేదన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి!

మధ్యలో సోమవారం ఒక్క రోజు ఆగితే మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఏపీలో కౌంటింగ్ మొదలైపోతుంది.. ప్రజలు వైసీపీకే పట్టం కట్టారా.. లేక, కూటమినే కోరుకున్నారా అనేది సుస్పష్టం కానుంది..! మరి ఏపీలోని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏయే సంస్థల ఫలితాలు ఎగ్జాట్ ఫలితాలకు మ్యాచ్ అవుతాయనేది వేచి చూడాలి!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించినప్పుడు అతి తక్కువ సర్వే సంస్థలు మాత్రం తమ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి పరితపిస్తుంటాయి! ఏమాత్రం తప్పు జరగకుండా జాగ్రత్తపడుతుంటాయి! రేపటి రోజున మరోసారి తమ ఫలితాలను, తమ అంచనాలను జనం నమ్మరేమో అనే భయంతో ప్రవర్తిస్తుంటాయి!

అయితే... నిన్న పడిన చినికులకు ఈ రోజు మొలిచిన మొక్కల్లాంటి కొన్ని సంస్థలు మాత్రం క్రెడిబిలిటీతో ఏమాత్రం సంబంధం లేకుండా.. జనాలను పిచ్చోళ్లను చేస్తూ, ఒకరోజు హల్ చల్ చేయడానికి మాత్రమే ఆత్రుత చూపిస్తుంటాయని అంటుంటారు. ఏది ఏమైనా.. జూన్ 4 న కౌంటింగ్ ప్రక్రియ మొదలవ్వబోతుంది.. సాయంత్రానికి వాస్తవాలు వెల్లడికాబొతున్నాయి!