హలో డీఎస్పీ .. కేఎఫ్ లైట్ బీర్లు ప్లీజ్
కానీ గత కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో లేవు.
By: Tupaki Desk | 30 April 2024 2:45 AM GMT‘’ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డీఎస్పీ గారికి జిల్లాలోని వైన్స్ మరియు బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యంకావడం లేదన్న విషయం గురించి… రాష్ట్రానికి గత 18 రేజులలో రూ.618 కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందంగా ఉన్నది. కానీ గత కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో లేవు. ఎండ తీవ్రత నుండి దాహం తీర్చుకునేందుకు యువత, పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు’’ నా దృష్టికి వచ్చిందని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడం విశేషం.
మంచిర్యాల జిల్లాలో కాకుండా కరీంనగర్, జగిత్యాల, అసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలలో ఈ బీర్ల కొరత ఉందని, లైట్ బీర్లను సేవించడం ద్వారా తక్కువ మత్తు మూలంగా తాగినా కూడా మా పనులను మేము చేసుకుంటామని సదరు సంఘం ప్రబుద్దుడు లేఖలో స్పష్టంచేశాడు.
స్ట్రాంగ్ బీర్ల మూలంగా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వస్తున్నాయని అందుకే చల్లని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాడు.
సిండికేట్ గా ఏర్పడ్డ వైన్ షాప్ యజమానులు కింగ్ ఫిషర్ బీర్లలో తక్కువ మార్జిన్ వస్తుందని వాటిని అందుబాటులో ఉంచడం లేదని, వారి మార్జిన్ కోసం కొత్త బీర్లను తేవడం మూలంగా గతిలేక తాగి మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నామని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.