టార్గెట్ స్టాలిన్... ఉదయనిధిపై సుప్రీంకోర్టు జడ్జికి సంచలన లేఖ!
అవును... ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన వందల మంది ప్రముఖులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కు లేఖ రాశారు.
By: Tupaki Desk | 5 Sep 2023 1:42 PM GMTసనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు దేశరాజకీయాలు తిరుగుతున్నాయన్నా అతిశయోక్తి కాదేమో! ఇండియా కూటమిలో డీఎంకే కూడా కీలక భాగస్వామి కావడంతో... రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో... రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే ఫిర్యాదులమోత మోగుతుందని తెలుస్తుంది.!
ఈ క్రమంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా సుమారు 262 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని వారంతా సుప్రీం ను కోరారు! దీంతో... ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన వందల మంది ప్రముఖులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగా... దేశంలో అత్యధిక జనాభా ఉన్న వారికి వ్యతిరేకంగా స్టాలిన్ మాట్లాడారని.. పైగా ఆ మాటలకు కనీసం క్షమాపణలు చెప్పేందుకు కూడా ఒప్పుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆ లేఖలో ప్రధానంగా సంతకం చేసిన ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్. ధింగ్రా... ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీం ని కోరారు. ఇదే సమయంలో ఉదయనిధిపై చర్యలు తీసుకోవడంలో తమిళనాడు సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
మరోపక్క ఈ విషయంపై పూర్తిస్థాయిలో కాన్సంట్రేషన్ చేస్తున్న బీజేపీ తాజాగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఉదయనిధి స్టాలిన్ ను నియంత హిట్లర్ తో పోల్చింది. ఇందులో భాగంగా... యూదులను ఎలా ఊచకోత కోయాలని హిట్లర్ పిలుపునిచ్చారో.. అచ్చం అలాగే సనాతన ధర్మంపై స్టాలిన్ కూడా వ్యాఖ్యానించారని విమర్శించింది.
కాగా... డెంగ్యూ, మలేరియా, కరోనాను వ్యతిరేకించడం కాదు వాటిని సమూలంగా నిర్మూలించాలి. అదేవిధంగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కంటే నిర్మూలించడమే ముఖ్యమని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీంతో... ఈ వ్యాఖ్యలపై ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. పురోహితులు సైతం ఉదయనిధి తల తీసుకొస్తే బహుమతులు అంటూ ప్రకటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.