Begin typing your search above and press return to search.

ఈ సంపన్న దేశంలో ఆర్మీ లేదు, ఎయిర్ పోర్ట్ లేదు... ఏమిటీ స్పెషల్?

స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య దాగి ఉన్న.. రైల్ లోయ పైన ఉన్న పర్వత వాలులతో కూడిన ఒక చిన్న దేశం పేరు "లిచ్టెన్ స్టెన్"..

By:  Tupaki Desk   |   20 March 2025 12:38 PM IST
ఈ సంపన్న దేశంలో ఆర్మీ లేదు, ఎయిర్ పోర్ట్ లేదు... ఏమిటీ స్పెషల్?
X

సాధారణంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, శక్తివంతమైన దేశాలు అని చెప్పడానికి ఆ దేశం కలిగిఉన్న అధునాతన ఆయుధాలు, నైపుణ్యం కలిగిన దళాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని అంటారు! అయితే... ఇప్పుడు చెప్పుకోబోయే దేశానికి ఆర్మీనే లేదు.. దానికి తోడు ఆ దేశంలో విమానాశ్రయం కూడా లేదు. అలా అని అదేమీ పేద దేశం కాదు సుమా... అత్యధిక తలసరి ఆధాయం ఉన్న దేశాల్లో ఒకటి!

అవును... స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య దాగి ఉన్న.. రైల్ లోయ పైన ఉన్న పర్వత వాలులతో కూడిన ఒక చిన్న దేశం పేరు "లిచ్టెన్ స్టెన్".. ఈ దేశ రాజధాని పేరు వాడుజ్. ఈ దేశ వైశాల్యం 160 చదరపు కి.మీ కాగా.. జనాభా 2023 అధికారిక లెక్కల ప్రకారం 39,850 కాగా.. ప్రస్తుతం కాస్త అటు ఇటుగా 40,000 అని అంటున్నారు! వీరు జర్మన్ భాష మాట్లాడతారు.

ఈ దేశానికి ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి.. ఈ దేశానికి ఆర్మీ లేకపోవడం కాగా.. రెండోది విమానాశ్రయం కూడా లేకపోవడం. అంతకంటే ముందు.. ఈ దేశం ఆర్థికంగా ప్రపంచంలో అత్యధిక తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) కలిగి ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ప్రజలు 100శాతం ఇంటర్నెట్ వాడతారు. ఈ దేశ జనాభా ప్రపంచంలోని అత్యున్నత జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారని చెబుతారు.

ఈ దేశంలో ఎలక్ట్రానిక్స్, విద్యుత్ ఉపకరణాలు, వస్త్రాలు, యాంకర్ బోల్టులు, కాలిక్యులేటర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తులు వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇదే సమయంలో... గోదుమ, మొక్కజొన్న, బార్లీ, పాల ఉత్పత్తులు, వైన్ లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక లిచ్టెన్ స్టెయిన్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం పెద్ద భాగాన్ని కలిగి ఉంది.

ఇక, దేశంలో శాంతిభద్రతలను కాపాడటానికి లీచ్టెన్ స్టెయిన్ జాతీయ పోలీసులు విభాగం ఉంది. ఇందులో మొత్తం 125 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యల్ప నేరాల రేటు ఉండగా.. లీచ్టెన్ స్టెయిన్ జైలులో ఖైదీల సంఖ్య 15 వరకూ ఉంటారు! మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఇక్కడ జనాభా కంటే ఉద్యోగాల సంఖ్య ఎక్కువ!

ఇదే సమయంలో... 1866 ఆస్ట్రో-ప్రష్యన్ యుద్ధం తర్వాత ఆర్థిక కారణాలతో ఈ దేశం సైన్యాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఇక్కడ ఆర్మీ ఉండదు. అయినప్పటికీ... పోలీసు దళం ప్రిన్స్లీ లీచ్టెన్ స్టెయిన్ సెక్యూరిటీ కార్ప్స్ అనే పారామిలటరీ దళం మాత్రం ఉంటుంది.. దేశంపై దండయాత్ర జరిగితే ఈ సంస్థ దాని వాస్తవ సైన్యంగా పనిచేయగలదు!

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ దేశానికి సొంత విమానాశ్రయం లేదు. ఈ దేశం చిన్న పరిమాణం, పర్వత భూభాగం కారణంగా పూర్తి స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించడం, నిర్వహించడం సాధ్యం కాలేదని చెబుతారు. అయితే... స్విట్జర్లాండ్, జర్మనీలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు సమీపంలో ఈ దేశం ఉండటంతో ఆ అవసరం తీరిపోతోందని అంటారు.

ఇదే సమయంలో... జ్యూరిచ్ విమానాశ్రయానికి, ఫ్రెడ్రిచ్ షాఫెన్ ఎయిర్ పోర్ట్ కి ఈ దేశం నుంచి కారు లేదా రైలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అయితే... ఈ దేశానికి సొంత విమానాశ్రయం లేకపోయినా... బాల్సర్స్ లో ప్రైవేటుగా నిర్వహించబడే హెలికాప్టర్ ఎయిర్ ఫిల్డ్ ను కలిగి ఉంది.