కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!
ప్రైవేటు కారు యజమానులకు కాస్త ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 Feb 2025 11:48 AM GMTప్రైవేటు కారు యజమానులకు కాస్త ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే కారు యజమానులకు టోల్ బాదుడు కాస్త తగ్గనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఏడాది పాటు చెల్లుబాటయ్యే టోల్ పాస్ ను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని అంటున్నారు.
అవును... ప్రైవేటు కారు యజమానులకు కాస్త ఉపశమనం కలిగించే ఆలోచన కేంద్రం చేస్తోందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... వార్షిక, 15 ఏళ్ల పాస్ లను అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో... రూ.3,000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే ఏడాది పాటు నేషనల్ హైవేపై ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు.
ఇదే సమయంలో... రూ.30 వేలు చెల్లిస్తే 15 ఏళ్లపాటు హైవేలపై అపరిమితంగా ప్రయాణించొచ్చని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద తుది పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ రహదారులపై రోజూ ప్రయాణించే వాహనదారులకు ఒక్క టోల్ ప్రాజాకు మాత్రం ఈ విధంగా మత్లీ పాస్ లు జారీ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన అధికారులు... నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ వార్షిక, 15 ఏళ్ల పాస్ లను ప్రవేశపెట్టడం వల్ల స్వల్పకాలంలో ఆదాయం తగ్గినప్పటికీ, దీర్ఘకాలికంగా ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం లేదని అంటున్నారు. దీనివల్ల టోల్ బూత్ ల వద్ద రద్దీ కూడా తగ్గుతుందని, ఈ ప్రాజెక్ట్ ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.