జనసేనకు ఉప్మా...ముద్రగడ ఏమీ తేల్చడేంటి చెప్మా...!?
ఇంతకీ విషయం ఏంటీ అంటే తన ఇంటికి వచ్చిన జనసేన నేతలకు ఇటీవల ముద్రగడ బాగానే చూసుకున్నారుట.
By: Tupaki Desk | 24 Jan 2024 3:00 AM GMTగోదావరి జిల్లాలలో మంచీ మర్యాదలు ఒక లెవెల్ లో సాగుతాయి. ఆ విషయంలో లోటే లేదు. వచ్చిన వారిని కడుపు నిండా పెట్టి కానీ పంపించరు. ఇక కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయం అయితే ఇంకా ఎక్కువే. అతిధి మర్యాదలు ఆయన గట్టిగానే చేస్తారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే తన ఇంటికి వచ్చిన జనసేన నేతలకు ఇటీవల ముద్రగడ బాగానే చూసుకున్నారుట.
అల్పాహారం బాగా పెట్టి కొసరి కొసరి వడ్డించారుట. అయితే ముద్రగడ ఈ సందర్భంగా జనసేన నేతలకు ఉప్మా పెట్టి బాగానే తినమని అభిమానం చూపారుట. అలాగే చెట్నీ వేసుకొండి అని మురిపెం చూపారట. అంతే కాదు దోసెలు వచ్చాయని తినమని కోరారు. ఆ మీదట కాఫీలు అన్నీ బాగానే జరిగాయి.
వచ్చిన జనసేన నేతలు కడుపారా ఆరగించారు. ముద్రగడ అభిమానాన్ని మనసారా ఆస్వాదించారు. అక్కడితో ఆగలేదు అపుడే మొదలైంది అసలు కధ. ఇంతకీ ముద్రగడ ఏమన్నారు అంటే నా మద్దతు కోసం వచ్చారు. జనసేనలో చేరమంటున్నారు. అంతా బాగానే ఉంది, ఇంతకీ జనసేన టీడీపీ పొత్తుల కధా కమామీషూ కాస్తా చెప్పండి అని వివరాలు అన్నీ లోతుగానే అడిగి తెలుసుకున్నారుట.
టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుందని అడిగారుట. అంతే కాదు అధికారంలో వాటా ఏమైనా ఉంటుందా అని కూడా అడిగారుట. ఇక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగారుట. అసలు ఇంతకీ జనసేన టీడీపీల మధ్య ఏ నిష్పత్తిలో సీట్ల షేరింగ్ ఉంటుందని కూడా ముద్రగడ ప్రశ్నించారుట.
అయితే అన్నింటికీ జనసేన నేతల వద్ద ఒకే సమాధానంగా వచ్చిందని అంటున్నారు. అదే మా వద్ద ఎలాంటి భోగట్టాలు వివరాలు లేవండి అని. దాంతో ముద్రగడ మండిపడ్డారుట. అసలు మన కాపులకు టీడీపీ నుంచి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, అసలు ఎవరికి ఇస్తారో కూడా అసలు తెలియదు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వంటి పదవుల విషయం ఇంకా తెలియదు, మరి ఏమీ తెలియకుండా చంద్రబాబు పల్లకీ మోయడమేంటి అని చికాకు పడ్డారుట.
సరే మీ సంగతి ఏమో తెలియదు నాకు అయినా ఆలోచనలు ఉండాలి కదా అని ఆయనే అన్నారుట. అసలు పవన్ కళ్యాణ్ కి ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియకుండా ఏమిటిది అని ముద్రగడ కాస్తా ఆశ్చర్యంగానే అడిగారుట. అసలు ఏ మాత్రం ప్రతిఫలం ఆశించకుండా ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియకుండా కేవలం భేషరతుగా టీడీపీకి మద్దతు ఇవ్వడమేంటి అని కూడా ముద్రగడ కాస్తా గరం గరం అయ్యారుట.
ఏమీ తెలియకుండా ఏ ఒప్పందం లేకుండా ఆ రాజకీయ పార్టీకి పని చేయడమేంటి అని కూడా అన్నారుట. దాంతో ముద్రగడ ఇంట్లో ఉప్మాలు తిన్న జనసేన నేతలకు ఏదీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.
అసలు ఇవన్నీ కాదు అబ్బాయ్. జనసేనకు ఎన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారో క్లారిటీగా చెప్పండి, అపుడు నేను జనసేనలో చేరుతాను అని ముద్రగడ ఒక కండిషన్ అయితే పెట్టేశారుట. నేను అయితే జనసేనలో చేరడానికి రెడీ. కానీ గుడ్డిగా అక్కడ పనిచేయలేను నా వల్ల కాదు అని ముద్రగడ పెద్ద దండమే పెట్టేశారుట.
నాకుగా నేను అయితే చంద్రబాబుకు ఏ విధంగానూ సేవ చేయలేను, నా ఆత్మ గౌరవం కూడా చంపుకోలేను అంటూ ముద్రగడ కుండబద్ధలు కొట్టడంతో తెల్లముఖం వేయడం జనసేన నేతల వంతు అయింది అని అంటున్నారు. వరసబెట్టి ఇన్నేసి ప్రశ్నలు వేసినా ముద్రగడకు ఏ జవాబు ఇవ్వలేని జనసేన నేతలు బయటకు దిగాలుగా వచ్చారు అని అంటున్నారు.
మొత్తానికి ముద్రగడ జనసేనలో చేరుతారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేకుండా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది అని అంటున్నారు. అదండీ ముద్రగడ ఇంట్లో జనసేన నేతల ఉప్మా కధ అని ప్రచారం అయితే జోరుగా గోదావరి జిల్లాలలో సాగుతోంది.