Begin typing your search above and press return to search.

లీలావతి ఆస్పత్రిలో క్షుద్ర పూజలు... ఈడీ ఎంట్రీ ఎందుకంటే..?

దీంతో.. క్షుద్ర పూజల అంశం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో.. రూ.1500 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 March 2025 1:44 PM IST
లీలావతి ఆస్పత్రిలో క్షుద్ర పూజలు... ఈడీ ఎంట్రీ ఎందుకంటే..?
X

ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి ఆస్పత్రికి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. ఆస్పత్రిలోని ట్రస్టీల కార్యాలయం కింద మానవ ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, కలశాలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో.. క్షుద్ర పూజల అంశం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో.. రూ.1500 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని అంటున్నారు.

అవును... ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి ఆస్పత్రిని నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మొహతా మెడికల్ ట్రస్ట్, మాజీ ట్రస్టీలు, సంబంధిత వ్యక్తులు రూ.1,500 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బాంధ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు దాఖలు చేసినట్లు పీటీఐ నివేదించింది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఇదే సమయంలో.. ఆస్పత్రి ఆవరణలో క్షుద్ర పూజలు నిర్వహించబడిందని కూడా ట్రస్ట్ ఆరోపిస్తోంది. ఆస్పత్రిలోని ఆర్థిక రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పీటీఐ వార్తాసంస్థ నివేదిక ప్రకారం... బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్ మాజీ ట్రస్టీలపై పలు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలు చేసింది!

ఈ సందర్భంగా స్పందించిన ఎల్.కే.ఎం.ఎం.టీ. పర్మనెంట్ రెసిడెంట్ ట్రస్టీ ప్రశాంత్ మొహతా... బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు తాము ఫిర్యాదులు దాఖలు చేశామని.. అవి ఎఫ్.ఐ.ఆర్.లుగా మారాయని.. మాజీ ట్రస్టీలు, ఇతర సంబంధిత వ్యక్తులపై మూడు కంటే ఎక్కువ ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలు చేయబడ్డాయని తెలిపారు.

ఇదే సమయంలో.. తాము నిర్వహించిన ఆడిట్ లో అక్రమ ట్రస్టీల బృందం రూ.1,500 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా వెల్లడైందని.. ఈ డబ్బును మాజీ ట్రస్టీలు స్వాహా చేశారని.. వీరిలో ఎక్కువ మంది ఎన్నారైలు, దుబాయ్, బెల్జియం నివాసితులు ఉన్నారని మొహతా ఆరోపించారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయాలని మొహతా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను అభ్యర్థించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఆస్పత్రి ప్రాంగణంలోని క్షుద్ర పూజలపైనా స్పందించిన ఆయన... అక్కడ వెంట్రుకలు, ఎముకలు, పుర్రెలతో ఏడు కంటే ఎక్కువ కలశాలు కనుగొన్నామని అన్నారు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది!