Begin typing your search above and press return to search.

విదేశీ విద్యార్థుల సంఖ్యపై కెనడాలో పరిమితి?... కారణాలివే!

ఈ అంశాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 6:39 PM GMT
విదేశీ విద్యార్థుల సంఖ్యపై కెనడాలో పరిమితి?... కారణాలివే!
X

కెనడా ప్రభుత్వం భారీ ఎత్తున వలసదారులను స్వాగతించడంపై గత కొంత కాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే స్థానికంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతోపాటు ఇళ్ల కొరత విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.

అవును... కెనడాలో రోజు రోజుకీ నిరుద్యోగం పెరిగిపోతుండటంతోపాటు ఇళ్ల కొరత ఏర్పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా దేశంలో నివసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించే దిశగా ఆలోచనలు జరుపుతున్నట్లు ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ వెల్లడించారు.

ఈ విషయాలపై స్పందించిన మార్క్‌ మిల్లర్‌... త్వరలోనే ఈ విషయాలపై కెనడా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు. విదేశీ విద్యార్థుల విషయంలో ప్రస్తుతం పరిస్థితి అదుపుతప్పిందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కేంద్రమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో విధించబోయే పరిమితి ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేమని తెలిపారు. అయితే... పలు విద్యాసంస్థల ఆదాయ వనరులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

ఇదే సమయంలో... కెనడా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉందని.. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి సగటు వయసును తగ్గించాలని వస్తున్న డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ పేర్కొన్నారు.

కాగా... భారీ ఎత్తున వలసదారులను స్వాగతించడంపై కెనడా కేంద్ర ప్రభుత్వం గతకొంత కాలంగా విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే! ఈ ఏడాది 4.85 లక్షల మంది విదేశీయులను అనుమతించాలని అధికార లిబరల్‌ పార్టీ నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో మరో పది లక్షల మందిని దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమైంది. దీంతో... దీన్ని అదుపు చేయకపోతే ఇళ్ల కొరత పెద్ద సంక్షోభంగా మారుతుందని ప్రభుత్వాన్ని మీడియా హెచ్చరిస్తుంది.