వాజపేయీ-మోదీతో లింక్.. మూడుసార్లు ప్రధాని.. నాలుగేళ్లకు స్వదేశానికి..
నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ కు ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ విషయంలో పలు కీలక పరిణామాలు జరిగాయి.
By: Tupaki Desk | 21 Oct 2023 11:20 AM GMTఆయన సంపన్న కుటుంబంలో జన్మించారు. రాజకీయాల్లోనూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. రాజకీయ పార్టీ అధినేతగా చక్రం తిప్పారు. ఓ దశలో దేశంలో తిరుగులేని ప్రజాదరణ పొందారు. కానీ, కాలం అన్నిసార్లూ ఒకేలా ఉండదు కదా..? అసలే అది సైన్యం పెత్తనం సాగే దేశం.. దీంతో ఆయన పదవిని కోల్పోయారు. మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన ఆ నాయకుడు.. ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. విశేషం ఏమంటే.. ఓ దశలో స్వదేశం ముఖం చూస్తానా? అని మదనపడిన ఆయన.. సొంత తమ్ముడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తిరిగి రాగలిగారు.
పొరుగున కీలక పరిణామం...
నవాజ్ షరీఫ్ అంటే ఇప్పుడు కాస్త పేరు వినిపించకపోవచ్చు కానీ.. 20 ఏళ్ల కిందటి వరకు ఆయన పాకిస్థాన్ లో పెద్ద నాయకుడు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్-నవాజ్) పార్టీకి అధ్యక్షుడు అయిన మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా సొంతగడ్డపై అడుగుపెట్టారు. వివిధ కేసుల్లో కోర్టు విచారణలు ఎదుర్కొంటున్న షరీఫ్ లండన్ లో ఉంటున్నారు. అయితే, కాలం కలిసివచ్చి.. స్వదేశం చేరేందుకు ఆయనకు మార్గం సుగమమైంది. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలతో లండన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా దుబాయ్ ప్రయాణమయ్యారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో పాకిస్థాన్ కు వచ్చారు. రాజధాని ఇస్లామాబాద్ లో దిగిన ఆయనకు ఘన స్వాగతం దక్కింది. ఇదంతా పొరుగు దేశంలో కీలక పరిణామంగా చెప్పవచ్చు.
మూడు నెలల్లో ఎన్నికలు..
పాకిస్థాన్ లో వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలున్నాయి. అక్కడ ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. దానికితోడు ఆర్థిక సంక్షోభం. ఇలాంటి సమయంలో నవాజ్ షరీఫ్ తిరిగిరావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుపాలయ్యారు. ఇమ్రాన్ కు చెందిన పీటీఐ పార్టీనే నవాజ్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి.
అవినీతి కేసులో..అటు ఇమ్రాన్, ఇటు నవాజ్.. ఇద్దరూ ప్రధానులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవాజ్ షరీఫ్ కు శిక్ష పడింది. అయితే, అనారోగ్యాన్ని చూపి.. ఆయన చికిత్స కోసం లండన్ చేరారు. కానీ, ఇప్పుడు పాకిస్థాన్ ను శాసించే సైన్యంతో రాజీ పడి స్వదేశం చేరారు. అయితే, పలు కోర్టు కేసులున్న నవాజ్ కు న్యాయపరంగా, రాజకీయపరంగా సవాళ్లు ఎదురవడం ఖాయం. ఎవెన్ ఫీల్డ్, అల్ అజీజియా అవినీతి కేసుల్లో నవాజ్ కు అక్టోబరు 24 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తోషాఖానా, వాహనాల కేసుల్లో అరెస్టు వారెంటును అవినీతి నిరోధక కోర్టు కూడా ఈ నెల 24 వరకు రద్దు చేసింది. దీంతోనే నవాజ్ షరీఫ్ దిలాసాగా పాకిస్థాన్ లో కాలుపెట్టారని తెలుస్తోంది.
కొసమెరుపు
నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ కు ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ విషయంలో పలు కీలక పరిణామాలు జరిగాయి. వాటిలో ప్రధానమైనది కార్గిల్ యుద్ధం (1999). రెండోది భారత మాజీ ప్రధాని వాజ్ పేయీ చేపట్టిన ఢిల్లీ-లాహోర్ బస్సు యాత్ర. వివిధ రంగాల ప్రముఖులతో కలిసి 1999 ఫిబ్రవరిలో వాజ్ పేయీ బస్సులో లాహోర్ వరకు ప్రయాణించి చరిత్రకెక్కారు. అయితే, ఇది జరిగిన నాలుగైదు నెలలకే పాకిస్థాన్ కార్గిల్ లో దురాక్రమణకు దిగింది. ఇక మూడోది.. మోదీ తొలిసారి ప్రధాని అయిన సమయంలో 2015లో విదేశీ పర్యటన నుంచి తిరిగొస్తూ అనూహ్యంగా పాకిస్థాన్ లో ఆగారు. అప్పుడు పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ ను కలిసి సంచలనం రేపారు.