Begin typing your search above and press return to search.

'కిక్కు' ఇచ్చే శుభవార్త చెప్పిన ఫుడ్‌ డెలివరీ యాప్స్‌!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌.. జొమాటో, స్విగ్గీ వినియోగదారులకు ‘కిక్కు’ ఇచ్చే శుభవార్తను తెచ్చాయి

By:  Tupaki Desk   |   16 July 2024 9:30 AM GMT
కిక్కు ఇచ్చే శుభవార్త చెప్పిన ఫుడ్‌ డెలివరీ యాప్స్‌!
X

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌.. జొమాటో, స్విగ్గీ వినియోగదారులకు ‘కిక్కు’ ఇచ్చే శుభవార్తను తెచ్చాయి. ఈ యాప్స్‌ ఇక నుంచి మద్యాన్ని కూడా డోర్‌ డెలివరీ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ యాప్స్‌ వివిధ రకాల అల్పాహారాన్ని, భోజనాలను, స్నాక్స్‌ ను, బిర్యానీ వంటివాటిని అందిస్తున్నాయి. ఇప్పుడు మద్యాన్ని కూడా అందిస్తామని ప్రకటించడంతో మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జొమాటో, స్విగ్గీనే కాకుండా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఫ్రూట్స్‌ ను డోర్‌ డెలివరీ చేస్తున్న బిగ్‌ బాస్కెట్‌ సైతం మద్యాన్ని డోర్‌ డెలివరీ చేయనుంది. ఈ మేరకు ఈ మూడు సంస్థలు.. వైన్, బీరు, బ్రీజర్‌ వంటి తక్కువ ఆల్కహాల్‌ ఉన్న మద్యాన్ని డోర్‌ డెలివరీ చేయనున్నాయి.

అయితే స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసే రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్, తెలంగాణ లేవు. ముందు ఢిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో మద్యం డోర్‌ డెలివరీని పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారని చెబుతున్నారు. అధికారులు కూడా ఇందుకు సంబంధించిన లెక్కల్లో ఉన్నారని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ డెలివరీ అమ్మకాలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

మద్యం షాపుల వద్ద రద్దీని నివారించడానికి, ముఖ్యంగా మహానగరాల్లో, నగరాల్లో, పట్టణాల్లో మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడానికే ఆన్‌లైన్‌ అమ్మకాలు చేపడుతున్నట్టు సమాచారం. అదేవిధంగా మద్యం షాపులకు వచ్చి కొనుగోలు చేయలేనివారికి ఈ విధానం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

కాగా ఆన్‌లైన్‌ లో మద్యం కొనుగోలు చేయడానికి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయని స్విగ్గీ అధికారి ఒకరు తెలిపారు. మద్యం కొనుగోలు చేయడానికి అవసరమైన నిర్దేశిత వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలని అంటున్నారు. అలాగే మద్యాన్ని ఆన్‌లైన్‌ లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నిర్దేశిత వేళల్లో మాత్రమే డోర్‌ డెలివరీ చేస్తారు. అలాగే నిర్దేశిత వేⶠల్లోనే కొనుగోలుకు వీలుంటుంది.

కాగా మద్యం డోర్‌ డెలివరీ విధానం కొత్తదేమీ కాదని తెలుస్తోంది. గతంలో కోవిడ్‌ వచ్చినప్పుడు 2021లో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్‌ తదితర రాష్ట్రాల్లో పాక్షికంగా మద్యం డోర్‌ డెలివరీకి అధికారులు అనుమతులు ఇవ్వడం గమనార్హం.

ఈ నేపథ్యంలో మద్యం డోర్‌ డెలివరీకి సంబంధించి ఆయా యాప్సుల ఉన్నతాధికారులు లెక్కల్లో మునిగారు. లాభనష్టాలు ఎలా ఉంటాయి? మద్యం డోర్‌ డెలివరీలో ఎదురయ్యే పరిస్థితులు తదితరాలపై చర్చలు జరుపుతున్నారు.