త్వరలో అభ్యర్ధుల లిస్ట్... బాబు ప్రకటనతో తమ్ముళ్ళలో టెన్షన్...!
ఆయన ఈ సందర్భంగా తన బంధు గణంతో కలిసి పెద్ద ఎత్తున పండుగను ఉత్సాహపూరితమైన వాతావరణంలో చేసుకున్నారు.
By: Tupaki Desk | 16 Jan 2024 3:15 AM GMTతెలుగుదేశం పార్టీ తొందరలోనే అభ్యర్ధుల లిస్ట్ ని ప్రకటిస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు తెలిపారు. నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా తన సొంత ఊరు నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన ఈ సందర్భంగా తన బంధు గణంతో కలిసి పెద్ద ఎత్తున పండుగను ఉత్సాహపూరితమైన వాతావరణంలో చేసుకున్నారు.
ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపధ్యంలో ఎపుడు అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తారు అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ త్వరలోనే లిస్ట్ ప్రకటిస్తామని అన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా మీద సర్వత్రా ఉత్కంఠ ఏర్పడుతోంది. తొలి జాబితాలో ఎవరు ఉంటారు ఎంతమందితో ఆ జాబితా ఉంటుంది అన్న టెన్షన్ అయితే పండుగ పూటా తమ్ముళ్లకు పట్టుకుంది.
అయితే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే యాభై నుంచి అరవై మందితో బాబు తొలి జాబితాను పండుగ దాటాక రిలీజ్ చేస్స్తారు అని అంటున్నారు. ఆ జాబితాలో అంతా సీనియర్లు కచ్చితంగా టికెట్ దక్కేవారు ఉంటారు అని అంటున్నారు. అలా కనుక చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి) కూన రవికుమార్ (ఆముదాలవలస), గౌతు శిరీష (పలాస), గుండ లక్ష్మీదేవి (శ్రీకాకుళం), కలమట వెంకటరమణ (పాతపట్నం), నిమ్మక జయక్రిష్ణ (పాలకొండ), బెందాళం అశోక్ (ఇచ్చాపురం) ఉంటారని తెలుస్తోంది.
అదే విధంగా విజయనగరం జిల్లా చూస్తే కోండ్రు మురళీమోహనరావు (రాజాం), అశోక్ గజపతిరాజు (విజయనగరం), బేబీ నాయన (బొబ్బిలి), కె అప్పలనాయుడు (గజపతినగరం), కోళ్ళ లలితకుమారి(ఎస్ కోట), కిమిడి నాగార్జున (చీపురుపల్లి) ఉంటారని అంటున్నారు
విశాఖ జిల్లాలో వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ తూర్పు), పి గణబాబు (విశాఖ పశ్చిమ), అయ్యన్నపాత్రుడు (నర్శీపట్నం), వంగలపూడి అనిత (పాయకరావుపేట) ఉండవచ్చు అంటున్నారు. అదే తీరున ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో కొన్ని సీట్లకు కూడా తొలి జాబితాలో అభ్యర్ధులను ప్రకటించవచ్చు అని అంటున్నారు.
ఇక ఇద్దరు ముగ్గురు అభ్యర్ధులు పోటీ పడుతున్న చోట. జనసేన కోరుతున్న సీట్లు ఉన్న చోట, బీజేపీతో పొత్తులో ఇవ్వాల్సిన సీట్లలోనూ అభ్యర్ధులను ప్రకటించరు అని అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ తొలి జాబితా మీద మాత్రం ఆసక్తి అయితే ఉంది.
ఒక విధంగా చూస్తే వంద మంది దాకా అభ్యర్ధులను ప్రకటించాలని అనుకున్నారు కానీ ఇపుడు తొలి జాబితాలో యాభై నుంచి అరవైకే పరిమితం అవుతుందని, అందులో ఎక్కువగా ఉత్తరాంధ్రా నుంచే అభ్యర్ధులు ఉండవచ్చు అని అంటున్నారు.