వందేళ్లు బతకటం సులువే.. సంచలనంగా ఆ ఫేమస్ వైద్యుడి మాట
తాజాగా ఆయన హైదరాబాద్ కు వచ్చారు. నిండు నూరేళ్లు బతకటం మరో పదేళ్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పి సంచలనంగా మారారు.
By: Tupaki Desk | 14 Nov 2023 4:25 AM GMTనూరేళ్లు చల్లగా జీవించన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ.. నూరేళ్లు బతకటం అంత సులువు కాదు. అయితే.. వందేళ్లు బతకటం పెద్ద కష్టమైన విషయం కాదని.. రానున్న రోజుల్లో అదంతా సులువుగా మారుతుందని చెబుతున్నారు ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు కం ఇన్ స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీ వ్యవస్థాపకుడు డాక్టర్ లెరోయ్ హుడ్. తాజాగా ఆయన హైదరాబాద్ కు వచ్చారు. నిండు నూరేళ్లు బతకటం మరో పదేళ్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పి సంచలనంగా మారారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు తండ్రి.. ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి. భాస్కర్ రెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన విశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ లెరోయ్ హుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టిన తేదీ ప్రకారం వయసు ముఖ్యం కాదని.. జీవ సంబంధమైన బయోలాజికల్ ఏజ్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
బయోలాజికల్ వయసు అనేది జన్యువులు.. జీర్ణకోశ ఆరోగ్యం.. వ్యాయామం.. నిద్ర.. ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని రకాల రక్త పరీక్షలతో ప్రతి వ్యక్తి బయోలాజికల్ వయసును నిర్దారించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చులు జరుగుతున్నాయని.. క్రోనలాజికల్ ఏజ్ కంటే బయోలాజికల్ వయసు తక్కువగా ఉండాలని.. తాజాగా జరుగుతున్న అధ్యయనాలతో బయోలాజికల్ ఏజ్ ను తగ్గించటం ద్వారా ఆయుష్షు పెంచటం.. నిండు నూరేళ్లు బతికేలా చేయొచ్చన్నది ఆయన వాదన.
రానున్న పదేళ్లలో వైద్య చికిత్సలో పెను మార్పులు రానున్నట్లు చెప్పారు. పెద్ద వయసుసమస్యలతో పాటు.. మధుమేహం.. క్యాన్సర్.. అల్జీమర్స్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ముందే పసిగట్టొచ్చన్న ఆయన.. మరో కీలక విషయాన్ని వెల్లడించారు. అధిక బరువు.. ఉబకాయంతో బాధ పడుతున్నారా? లేదా అన్న దానిపై ఇప్పటివరకు వేస్తున్న లెక్కల్లో నిజం లేదని చెప్పటం గమనార్హం.
వయసు .. బరువును తీసుకొని బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఒక వ్యక్తి అధిక బరువుతో ఉన్నారా? లేదా? అన్నది లెక్కిస్తున్నారని..కానీ ఇది సరైన లెక్క కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచి కొవ్వు.. కండ పుష్టి ఉండి బరువు ఉంటే అది ఊబకాయంగా భావించకూడదని చెప్పటం గమనార్హం. మెటబాలిక్ బీఎంఐను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న ఆయన.. ప్రతి వ్యక్తికి మెదడు ఆరోగ్యం కీలకమన్నారు. నడిచేటప్పుడు అటు ఇటు పరిశీలించాలని.. ఫజిల్స్ నింపటం.. గురుతులు నెమరవేసుకోవటం లాంటి వాటి ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రానున్న పదేళ్లలో వ్యాధులను ముందే గుర్తించి.. నివారించేందుకు అమెరికా.. చైనాతో సహా మన దేశం నుంచి తమ ఆసుపత్రి తరఫున లక్ష మందిపై అధ్యయనం చేస్తున్నట్లుగా వెల్లడించారు. తమ ఆసుపత్రిలో మంగళవారం నుంచి ప్రత్యేక ల్యాబ్ ను అందుబాటులోకి తెస్తున్నామని.. అందులో వ్యక్తి జన్యు విశ్లేషణ.. బ్లడ్ మార్కర్లు.. మైక్రో బయోమ్ పరీక్షలు చేయటం ద్వారా భారీ డేటా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో.. ముందస్తుగానే వచ్చే ఆరోగ్య సమస్యల్ని అంచనా కట్టే వీలుంది.