''సహజీవనం- ప్రమాదరకమైన అంటు వ్యాధి.. నిర్మూలనకు చట్టం తేవాలి''
ఒకవైపు సుప్రీంకోర్టు సహా ప్రజాసంఘాలు.. అభ్యుదయ వాదులు సహజీవనం తప్పుకాదని చెబుతున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 8 Dec 2023 3:47 AMఒకవైపు సుప్రీంకోర్టు సహా ప్రజాసంఘాలు.. అభ్యుదయ వాదులు సహజీవనం తప్పుకాదని చెబుతున్న విషయం తెలిసిందే. కొన్ని పరిమితులకు లోబడి.. సమాజ కట్టుబాట్లకు లోబడి.. సహజీవనం చేయడాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో సమర్థించింది. అయితే.. అనూహ్యంగా బీజేపీ ఎంపీ ఒకరు.. సహజీవనంపై సంచలన వ్యాఖ్యలు సంధించారు. ''సహజీవనం- ప్రమాదరకమైన అంటు వ్యాధి'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దీనిని నిర్మూలనకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.
ఎవరా సారు.. ?
హరియాణాకు చెందిన బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్ సంచలనాలకు వేదికగా ఉంటారు. ఆయన నోటి వెంట ఏం మాట్లాడినా.. వివాదాలకు కేరాఫే. అలానే తాజాగా ఆయన ఏకంగా లోక్‌సభలోనే వివాదాల తేనెతుట్టెను కదిలించారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో అనూహ్యంగా సహజీవన అంశాన్ని లేవనెత్తారు. దీనిని ప్రమాదకరమైన అంటువ్యాధిగా పోల్చారు.
''అధ్యక్షా.. ఇది అంటు వ్యాధి. ఒకరిని చూసి మరొకరు.. సహజీవనం చేస్తున్నారు. దీంతో కాపురాలు కూలిపోతున్నాయి. భారతీయ సంస్కృతికి ప్రమాదం ఏర్పడింది. ‘వసుధైవ కుటుంబకమ్’ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం కూడా భిన్నమైనది. కానీ, ఇప్పుడు ఇవన్నీ.. సహజీవనం అనే అంటు వ్యాధితో ఇబ్బంది పడుతున్నాయి'' అని అన్నారు.
అంతేకాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువగా విడాకులు వస్తున్నాయని చెప్పారు. వివాహం విషయంలో వధూవరుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని, అలాంటి వివాహాలు కలకాలం నిలుస్తున్నాయని చెప్పారు. సహజీవనం అనేది ప్రస్తుతం సమాజంలో ఓ ప్రమాదకరమైన జబ్బుగా, అంటు వ్యాధిగా మారుతోందని ఎంపీ ధరంవీర్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇది సాధారణమే అయినప్పటికీ.. మనదేశంలో ఇది సరికాదన్నారు.
సహజీవనం పరిణామాలు అత్యంత భయంకరంగా ఉంటున్నాయన్నారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్-అఫ్తాబ్ పూనావాల కేసును ఆయన ఉదహరించారు. ఈ నేపథ్యంలో సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని.. తద్వారా ఈ ప్రమాదకరమైన అంటు వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించగలమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.