18ఏళ్ల లోపు సహజీవనం చేస్తే క్రైం.. ఆ హైకోర్టు కీలక వ్యాఖ్య
సహజీవనం ఏ వయసు లో చేయాలి? ఏ వయస్కుల కు మాత్రమే చట్టబద్ధం? లాంటి ప్రశ్నల కు తాజాగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 3 Aug 2023 4:25 AM GMTసహజీవనం ఏ వయసు లో చేయాలి? ఏ వయస్కుల కు మాత్రమే చట్టబద్ధం? లాంటి ప్రశ్నల కు తాజాగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనానికి సంబంధించి వయసు పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేసిన హైకోర్టు మరిన్ని కీలక అంశాల్ని ప్రస్తావించింది. దీనంతటికి కారణం.. 18 ఏళ్ల లోపు వయసు లో ఉన్న ఒక అబ్బాయి తనకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో సహజీవనం చేయటమే.
సహజీవననాన్ని వివాహంతో సమానమైన సంబంధంగా పరిగణించేందుకు పలు షరతులు ఉన్నట్లుగా స్పష్టం చేసింది. సహజీవనం చేయాలంటే.. కనీసం మేజర్ అయి ఉండాలని తేల్చింది. అంటే.. పద్దెనిమిదేళ్ల వయసు దాటితేనే సహజీవనం చేసే వీలుందన్న విషయాన్ని పేర్కొంది. అసలీ వివాదం ఎలా మొదలైందంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి తన కంటే చిన్న వయసు అయిన 17 ఏళ్ల అబ్బాయితో వెళ్లిపోయింది.
వీరిద్దరు కలిసి ప్రయాగరాజ్ లో సహజీవనం చేస్తున్నారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆ కుర్రాడి మీద కిడ్నాప్ కేసు పెట్టారు. అంతేకాదు అబ్బాయి మీద ఐపీసీ సెక్షన్ 363, 366 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు వీరిద్దరిని తమతో పాటు గ్రామానికి తీసుకెళ్లారు. రెండు రోజులు గడిచిన తర్వాత ఆ యువతి తన ఇంట్లో నుంచి కష్టమ్మీదా బయటకు వచ్చి కుర్రాడి పేరెంట్స్ కు జరిగిన విషయాలన్నీ చెప్పుకొచ్చింది.
తాము ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటున్నామని.. కాబట్టి ఆ అబ్బాయి మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాల్సిందిగా ఆమె కోరింది. ఇందుకు కోర్టును ఆశ్రయించింది. అయితే.. అందుకు కోర్టు రిజెక్టు చేసింది. మేజర్ అయిన అమ్మాయితో సహజీవనం చేస్తున్న కారణంగా అతను చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. ఈ ఉదంతం లో సదరు అబ్బాయి ముస్లిం అని.. ముస్లిం లా ప్రకారం ఆ అమ్మాయితో అతడి సంబంధం అక్రమ సంబంధం కిందకు వస్తుందని స్పష్టం చేసింది.
అంతేకాదు.. పద్దెనిమిదేళ్ల లోపు వారిని పిల్లలుగా పరిగణించాల ని చెప్పింది. సహజీవనాన్ని నిషేధించే చట్టం లేకున్నా.. ఒక బాలుడిగా ఉంటూ ఇలాంటి సంబంధాల్ని కలిగి ఉండటాన్ని ఒప్పుకోదని కోర్టు స్పష్టం చేస్తూ.. "ఇలాంటివి సమాజానికి మంచివి కాదు. చట్టపరంగా ఎంతమాత్రం అనుమతించదగ్గని ఇలాంటి చర్యల్ని ఆమోదించటానికి మేం సిద్ధంగా లేం" అంటూ యువతి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
ఇక.. బాలుడి మీద పెట్టిన కిడ్నాప్ కేసు లో వారిద్దరూ సహజీవనం లో ఉన్న మాట వాస్తవమే అయినా.. అతడు ఆమెను తప్పుడు పద్దతుల్లో మోసం చేసి ఇంటి నుంచి తీసుకెళ్లాడా? లేదా? అన్న విషయాల మీద దర్యాప్తు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. మొత్తంగా ఈ ఉదంతం లో సహజీవనానికి కచ్ఛితంగా అబ్బాయి.. అమ్మాయిలు ఇద్దరు 18 ఏళ్లు నిండి ఉండాలన్న విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చినట్లుగా చెప్పొచ్చు.