ఆడ్వాణీ.. వారంలో రెండోసారి ఆస్పత్రి పాలు.. వెల్లడికాని అనారోగ్య కారణం
భారత రత్న.. బీజేపీ అగ్ర నేత లాల్ క్రిష్ణ ఆడ్వాణీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు.
By: Tupaki Desk | 4 July 2024 6:21 AM GMTభారత రత్న.. బీజేపీ అగ్ర నేత లాల్ క్రిష్ణ ఆడ్వాణీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఆయన రెండోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం రాత్రి ఆడ్వాణీని హుటాహుటిన ఢిల్లీ అపోలో కు తరలించారు. అయితే, గత బుధవారం సైతం ఆడ్వాణీకి ఇదే పరిస్థితి ఎదురైంది. నాడు ఎయిమ్స్ లో చేర్చారు. ఆ వెంటనే డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కూడా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ రథ సారథి, రామ మందిర ఉద్యమకారుడు అయిన ఆడ్వాణీ ప్రస్తుత వయసు 96 ఏళ్లు. వయో సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. ఎయిమ్స్ లో యూరాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ, ఆడ్వాణీ ఆరోగ్య సమస్య ఏమిటన్నది వెల్లడించలేదు.
ఈ ఏడాదే భారత రత్న..
ఎల్ కే ఆడ్వాణీకి ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించారు. దీనిని ఆయన ఇంటికెళ్లి అందజేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల సందర్భంగానూ ఆడ్వాణీ ఇంటి నుంచి ఓటేశారు. ఈ రెండు సందర్భాల్లోనే ఆయన బయటి ప్రపంచానికి కనిపించారు. దాదాపు పదేళ్ల కిందటనే ఆడ్వాణీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. 1927 నవంబరు 8న అవిభక్త భారత్ లోని కరాచీ (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది)లో ఆడ్వాణీ జన్మించారు. సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో చదివారు. 1941లో పద్నాలుగేళ్ల వయసులో ఆరెస్సెస్ లో చేరారు. 1947లోనే ఆరెస్సెస్ కరాచీ కార్యదర్శిగా పనిచేశారు. పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో ఉన్న డీజీ నేషనల్ కాలేజీలో లా చదవివారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. తొలుత రాజస్థాన్ లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పని చేశారు. 1957లో ఢిల్లీ వెళ్లి జన సంఘ్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్ నుంచి రెండోసారి పెద్దల సభకు వెళ్లారు. 1980 ఏప్రిల్ 6న వాజ్‌పేయీతో కలిసి బీజేపీని స్థాపించారు.
అయోధ్య ఉద్యమకారుడికి దక్కని ఆహ్వానం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఉద్యమం సాగించిన ఆడ్వాణీకి ఆ ఆలయం కల సాకారమైనా.. ప్రారంభోత్సవానికి మాత్రం ఆహ్వానం అందలేదు. ఆయనను తగు రీతిన ఆహ్వానించారా? లేదా? అన్నది కూడా స్పష్టం కాలేదు. మరోవైపు ఆడ్వాణీకి ఎన్నికల సంవత్సరంలో భారత రత్న ప్రకటిచడం పైనా విమర్శలు వచ్చాయి.