Begin typing your search above and press return to search.

గడిచిన ఐదేళ్లలో రూ.10.57 లక్షల కోట్ల రుణాలు మాఫీ!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా గడిచిన ఐదేళ్లలో 10.57 లక్షల కోట్లు రైటాఫ్ చేసినట్లు కేంద్రం తెలిపిన విషయం ఇప్పుడు చర్చ నీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   7 Dec 2023 3:45 AM GMT
గడిచిన ఐదేళ్లలో రూ.10.57 లక్షల కోట్ల రుణాలు మాఫీ!
X

భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకు ఎన్ని సమాధానాలున్నప్పటికీ... ఒక సమాధానం మాత్రం రెగ్యులర్ గా వినిపిస్తుంటుంది. ధనవంతుడికి ఒకరూలు, పేదవాడికి మరోరూల్ కొన్ని విషయాల్లో అప్లై అవుతుంటుందని.. ప్రధానంగా బ్యాంక్ రుణాల ఎగవేత, రుణాల మాఫీ వంటి విషయాల్లో ఇదీ భారీగా వినిపిస్తుంటుందని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా గడిచిన ఐదేళ్లలో 10.57 లక్షల కోట్లు రైటాఫ్ చేసినట్లు కేంద్రం తెలిపిన విషయం ఇప్పుడు చర్చ నీయాంశం అయ్యింది.

గడిచిన ఐదేళ్లలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్.సి.బి) దాదాపు రూ. 10.6 లక్షల కోట్లను మాఫీ చేశాయని, ఇందులో రూ.5.52 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు చెందినవేనని రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ సమాధానమిచ్చారు. "రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)" వివరాల ప్రకారం దేశంలోని షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ చేశాయి" అని ఆయన వివరించారు.

ఆర్బీఐ చట్టాన్ని ఉటంకిస్తూ ఖాతాలు రద్దు చేయబడిన వ్యక్తిగత రుణగ్రహీతల పేర్లను మంత్రి వెల్లడించలేదు కానీ... దాదాపు 2,300 మంది రుణగ్రహీతలు, ఒక్కొక్కరు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా సుమారు రూ. 2 లక్షల కోట్లను ఎగ్గొట్టారని తెలిపారు! అయితే ఇటువంటి రైటాఫ్‌ ల వల్ల రుణగ్రహీతలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యతలు మాఫీ చేయబడవని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ వ్రాతపూర్వకంగా తెలిపారు!

అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు సమిష్టిగా రూ. 5,309.80 కోట్లను అపరాధ రుసుములుగా వసూలు చేశాయని, వీటిలో రుణ చెల్లింపులో జాప్యానికి సంబంధించిన జరిమానాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ డేటాబేస్‌ లో నివేదించినట్లుగా... 31 మార్చి 2023 నాటికి మొత్తం 2,623 మంది ప్రత్యేక రుణగ్రహీతలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించబడ్డారని తెలిపారు.

మరోపక్క మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీసుకున్న చర్యలతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు డిశెంబర్ 1 నాటికి రూ.15,184 కోట్లు వచ్చాయని.. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై నమోదైన కేసుల్లో వారి ఆస్తులను ఈడీ జప్తు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 13,978 రుణ ఖాతాలపై రికవరీ కోసం లీగల్‌ సూట్స్‌ దాఖలయ్యాయని అన్నారు.