రంజుగా మున్సిపల్ రాజకీయం.. హిందూపురం టీడీపీ వశం.. ఏలూరు, నెల్లూరుల్లోనూ...
ఈ మున్సిపాలిటీలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
By: Tupaki Desk | 3 Feb 2025 9:33 AM GMTఏపీలో స్థానిక సంస్థల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో సాంకేతికంగా వైసీపీకే బలం ఉన్నా, ఆ పార్టీ ప్రతినిధులు ఫిరాయింపులతో టీడీపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్మనుతోపాటు, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేతలు విజయం సాధించారు.
రాష్ట్రంలో పది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్ల, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సోమవారం ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వైసీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పదవులకు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ఖాళీ అయిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పాగా వేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. ప్రధానంగా తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పరిస్థితులు అదుపులో లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. అదేవిధంగా నందిగామ మున్సిపల్ చైర్మన్ విషయంలో టీడీపీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రేపటికి వాయిదా పడింది.
ప్రధానంగా హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. ఎమ్మెల్యే బాలక్రిష్ణ బలపరిచిన రమేశ్ 23 ఓట్లతో చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో 38 వార్డులకు 30 చోట్ల వైసీపీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే చైర్మన్ ఉప ఎన్నికలో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి కేవలం 14 ఓట్లే వచ్చాయి. 15 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి హ్యాండిచ్చి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. అదేవిధంగా ఏలూరు, నెల్లూరు కార్పొరేషన్లలలో టీడీపీ అభ్యర్థులే డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి తహసీన్ డిప్యూటీ మేయరుగా ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి కేవలం 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్ లో కూడా వైసీపీకి సంపూర్ణ ఆధిక్యం ఉన్నా, మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ వశమైంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ టీడీపీలో చేరగా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు డిప్యూటీ మేయర్లను టీడీపీ నేతలే గెలుచుకున్నారు.
అదేవిధంగా ఏలూరు జిల్లాలోని నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవినీ టీడీపీ గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు.
మరోవైపు ఎన్నికలు సందర్భంగా టీడీపీ, జనసేన నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు విజయవాడలో ఈసీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఈసీకి ఫిర్యాదు చేశారు.