అమెరికాలో లాక్ డౌన్... ఏమిటీ 'ట్రిపుల్ ఈ' వైరస్!
ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్లు అమలుచేశారు.
By: Tupaki Desk | 29 Aug 2024 3:53 AM GMTలాక్ డౌన్ అనే పేరు వినగానే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుందనే సంగతి తెలిసిందే. కోవిడ్ మహమ్మారి పుణ్యమాని ప్రపంచం మొత్తానికి లాక్ డౌన్ అంటే వణికిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్లు అమలుచేశారు. దీనికి కారణం దోమ కాటుతో విస్తరించే ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సిఫలైటిస్ (ఈఈఈ) అనే కొత్త వైరస్.
అవును... అమెరికాలోని హడ్సన్ వ్యాలీ, చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పలు కౌంటీలలో 30% మరణాల రేటుతో మనుషులకు సోకే అరుదైన, ప్రాణాంతకమైన వైరస్ కనుగొనబడింది. దీని గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియదని అంటున్నారు. దీనికి సంబంధించిన మొదటి బాధితుడు మసాచుసెట్స్ లోని ఓ వృద్ధుడు అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పెరుగుతున్న ముప్పుకు ప్రతిస్పందనగా మసాచుసెట్స్ లోని డగ్లస్, ఆక్స్ ఫర్డ్, సుట్టన్, వెబ్ స్టర్ అనే నాలుగు పట్టణాల్లోనూ ఈ ప్రాణాంతక వ్యాదిని అరికట్టడానికి స్వచ్ఛంద లాక్ డౌన్ ను అమలుచేస్తున్నట్లు న్యూయార్క్ పొస్ట్ నివేదించింది. ప్రధానంగా సాయంత్రం వేళల్లో దోమల స్వైర విహారం ఎక్కువగా ఉండటంతో ఇలా ప్లాన్ చేసుకున్నారు.
ఈ .. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకూ ప్రతీ రోజూ సాయంత్రం 6:00 గంటల తర్వాత ఇంటిలోపలే ఉండేలా ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు.
ట్రిపుల్ ఈ అంటే ఏమిటి..?:
ఈఈఈ అంటే... ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్ సెఫాలిటీస్ అనేది దోమల వల్ల వచ్చే వ్యాది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెషన్.. దీనిని అరుదైన తీవ్రమైన వ్యాధిగా అభివర్ణించింది. ప్రతీ ఏటా యూఎస్ లో కొన్ని కేసులు మాత్రమే నమోదవుతున్నాయని పేర్కొంది. ప్రధానంగా ఈస్ట్, గల్ఫ్ కోస్ట్ రాష్ట్రాల్లో ఈ వ్యాది చాలా అరుదుగా ఉన్నప్పటికీ... వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో... దీనిని నివారించడానికి టీకాలు అందుబాటులో లేవు. దీనికోసమంటూ ప్రత్యేకంగా మందులూ లేవని చెబుతున్నారు. ఈ ట్రిపుల్ ఈ వ్యాది సోకే మనుషులు, జంతువులను "డెడ్ ఎండ్ హోస్ట్"లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాది వ్యాప్తి చెందకుండా... పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై నిషేధం విధించారు. హెలీకాప్టర్లతో దోమలు వ్యాప్తి చెందకుండా మందులు పిచికారీ చేస్తున్నారు.