మార్చి 3 తర్వాత ఎప్పుడైనా మెగా డీఎస్సీ నోటిఫికేషన్: లోకేష్
నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జూన్‌లోనే దీనిపై ముఖ్యమంత్రి చంద్ర బాబు తొలి ప్రాధాన్యం కింద సంతకం చేశారు.
By: Tupaki Desk | 28 Feb 2025 4:42 AM GMTరాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఫలితాలు రాగా నే.. కోడ్ ముగియనుందని పేర్కొన్నారు. అనంతరం.. డీఎస్సీపై నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జూన్‌లోనే దీనిపై ముఖ్యమంత్రి చంద్ర బాబు తొలి ప్రాధాన్యం కింద సంతకం చేశారు. ఈ క్రమంలో 16 వేల పోస్టులకు పైగానే భర్తీ చేయాల్సి ఉం టుంది.
సంతకం చేశారు.. బాగానే ఉంది. కానీ, 9 మాసాలు అయినా.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకో లేక పోయా రు. అయితే.. సుప్రీంకోర్టు నుంచి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఏపీ సర్కారు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసింది. ఈ కమిషన్ రిపోర్టు వచ్చాక.. దాని ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు రిజర్వేషన్ ఫలాలను అందిస్తామని చెబుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేశారు. కానీ, ఈ కమిషన్ రిపోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కుల సంఘాలు.. పార్టీలు.. కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
దీనిని గమనించిన ప్రభుత్వం.. కమిషన్ రిపోర్టుతో సంబంధం లేదు.. డీఎస్సీనోటిఫికేషన్ ఇస్తామని ప్రక టించింది. కానీ.. ఈ ప్రకటన చేసిన గంటలోనే.. కేంద్ర ఎన్నికల సంఘం.. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది. దీంతో కోడ్ అమల్లోకి వచ్చిందంటూ.. స్వయంగా మంత్రి నారా లోకేష్.. డీఎస్సీ షెడ్యూల్‌ను, నోటిఫికేషన్‌ను ఈ కోడ్ ముగియగానే ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా ఎన్నికల పోలింగ్ ముగియడంతో లోకేష్ త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చెప్పారు.
అయితే.. ఈ సారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇది.. మార్చి నెలాఖరు వరకు ఉండడం తో మెగా డీఎస్సీ.. కథ మరోసారి యూటర్న్ తీసుకుంటుందన్న చర్చ సాగింది. కానీ, ఇది కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నికలు కావడంతో సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనందున.. న్యాయ నిపుణుల సలహా తీసుకుని.. ఆమేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో మార్చి 3 తర్వాత ఎప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని అంటున్నారు.