కల్యాణ మహోత్సవంలో లోకేష్ దంపతులు... బ్రాహ్మణి ఇంట్రస్టింగ్ పోస్ట్!
ఈ సమయంలో... మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన కల్యాణ మహోత్సవాల్లో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.
By: Tupaki Desk | 14 March 2025 1:27 PM ISTమంగళగిరి ప్రజలతో నారా లోకేష్ ఫ్యామిలీ మమెకమై, ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో... మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన కల్యాణ మహోత్సవాల్లో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.

అవును... మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరుపున లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం.. వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి, అనుగ్రహం పొందారు.

ఈ సందర్భంగా వేదపండితులు.. మంత్రి నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకు ముందు.. స్వామివారి దేవాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ దంపతులకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేస్తూ.. నారా బ్రాహ్మణి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.

ఈ సందర్భంగా... మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి 12.00 గం.లకు నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చిందని.. మా దంపతులిద్దరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి అనుగ్రహం కోరామని.. వేదపండితులకు నమస్కరించి ఆశీర్వచనాలు అందుకున్నామని బ్రాహ్మణి వెల్లడించారు.